Ganesh Chaturthi 2024 Special: దశభుజ శ్రీ మహాగణపతి- ఒక్క ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎక్కడో కాదండోయ్
Ganesh Chaturthi 2024 | గణేష్ చతుర్ధి సందర్భంగా దశ భుజ గణపతి ఆలయం వివరాలు, విశిష్టతను ఇక్కడ అందిస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఉన్న గణపయ్య ఆలయంలో త్రినేత్రుడిగా విఘ్వేశ్వరుడు దర్శనమిస్తారు.
Dashabhuja Ganapathi Temple News | రాయదుర్గం: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఎటు చూసినా బొజ్జ గణపయ్యల సందడి కనిపిస్తోంది. భిన్న ఆకృతాల్లో, రంగుల్లో, పలు ప్రత్యేకతలతో గణేషుడి విగ్రహాలను చేసి విక్రయిస్తుంటారు. అయితే గణేష్ చతుర్థి 2024 (Ganesh Chaturthi 2024) సందర్భంగా వినాయకుడికి సంబంధించి ఓ ప్రత్యేకమైన టెంపుల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందామా. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పది చేతులు ఉన్న విఘ్నేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. భక్తుల కోరికలు తీర్చే బొజ్జ గణపయ్య సిద్ధి సమేతంగా కొలువు దీరిన గణనాథుడి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
త్రినేతుడ్రిగా బొజ్జ గణపయ్య
భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 10 చేతులు గల విఘ్నేశ్వరుడు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి గణపయ్య మూడు కళ్ళతో భక్తులకు దర్శనమిస్తూ త్రినేత్రుడిగా కొలువై ఉన్నాడు. ఎక్కడైనా విఘ్నేశ్వరుడికి తొండం ఎడమవైపు ఉంటుంది కానీ.. ఇక్కడ మాత్రం దేవాది దేవుడు వినాయకుడికి తొండం కుడివైపుకు తిరిగి ఉండడం ఒక ప్రత్యేకత. విఘ్నేశ్వరుడికి ఇద్దరు భార్యలు సిద్ధి,బుద్ధి కానీ ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడికి మాత్రం ఎడమవైపు భార్య సిద్ధిని చేత్తో ఆలింగణం చేసుకొని ఉన్నట్లు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ వినాయకుడిని సిద్ధి సమేతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు.
పది చేతుల వినాయకుడు
ఏ కార్యం మొదలుపెట్టిన ముందుగా విఘ్నేశ్వరుడికి మొదటి పూజ చేసే ఆనవాయితీ మనకి ఎప్పటినుంచో వస్తోంది. అలాంటి బొజ్జ గణపయ్యకు ఎక్కడైనా మనకు నాలుగు చేతులతో మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటాడు కానీ.. ఇక్కడ ఉన్న ఘనపయ్య మాత్రం పది చేతులతో మనకి దర్శనం ఇవ్వటం ఇక్కడ ప్రధానమైన ప్రత్యేకత. అందుకే ఈ గణపయ్యను దశబుజ గణపతి దేవాలయంగా పేరు.
రోజురోజుకీ పెరుగుతున్న గణనాథుడి విగ్రహం
ఇక్కడి గణేశుడు రాతి రూపంలో కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే రాతి రూపంలో ఉన్న గణనాథుడు రోజురోజుకి పెరుగుతూ ఉండడం విశేషం. దేవుడికి ఆభరణాలు చేయించి అలంకరిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా ఆభరణాలను అలంకరించేటప్పుడు అవి దేవుడికి సరిపోకపోవడం పూజారులు గుర్తించారు . ఇలా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడికి అలంకరించే ఆభరణాలను దేవుడికి సరిపోకపోవడంతో విఘ్నేశ్వరుడు విగ్రహ రూపంలో పెరుగుతూ ఉన్నట్లు అర్చకులు గుర్తించారు. సుమారుగా ఈ విగ్రహం 800 నుంచి 1000 సంవత్సరాలుగా ఉన్నట్లు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుర్తించింది.
పూర్ణ టెంకాయ నైవేద్యం
భక్తుల కోరికలు తీర్చే బొజ్జ గణపయ్యగా రాయదుర్గం పట్టణంలో కొలువుదీరిన గణనాథుడికి భక్తులు తమ కోరికను కోరుకుని పూర్ణ టెంకాయను ( టెంకాయకు పీచు తీయకుండా దేవుడికి సమర్పించడం ) విఘ్నేశ్వరుడికి సమర్పిస్తారు. కోరుకున్న కోరిక 30 లేదా 40 రోజులలో నెరవేరితే ఆ టెంకాయను భక్తులు తీసుకొని వెళ్లి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ గణపయ్యను దర్శించేందుకు ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.
Also Read: Vinayaka Chavithi: వినాయకచవితి పూర్తి పూజా విధానం...ఇది ఫాలో అవండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు!
ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలి !
అనంతపురం నగరం నుంచి రాయదుర్గం 100 కిలోమీటర్లు ఉంటుంది. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లి అక్కడ బస్సు ఎక్కితే కేవలం రెండు గంటల్లో రాయదుర్గం పట్టణం చేరుకోవచ్చు. అనంతపురం నుంచి రాయదుర్గం కు 150 రూపాయలు బస్సు చార్జీ. రాయదుర్గం పట్నం కర్ణాటక కు సరిహద్దు కావడంతో బళ్లారి నుంచి దేవాలయం కు కేవలం 40 కిలోమీటర్ల దూరమే ఉంటుంది.