Mandhatha:రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా?
రామ రావణ యుద్ధం గురించి అందరికీ తెలుసు. సీతాదేవిని అపహరించిన రావణుడు...రాముడి చేతిలో హతమయ్యాడని తెలుసు. కానీ రాముడి కన్నా ముందు రావణుడిని యుద్ధంలో ఓడించిన పరాక్రమ వంతుడెవరో తెలుసా?
రాముడి కన్నా ముందే రావణుడిని ఓడించిన రాజెవరో తెలుసా?
రావణుడు… అంటే శక్తికి మారుపేరు. ఘోరతపస్సు చేసి వరాలు పొందిన రాక్షసుడు. నిత్య శివారాధనతో పరమశివుడి వరాలు పొందిన భక్తితత్పరుడు. అత్యంత బలశాలి. ఎందరో రాజులను తన బాహుబలంతో ఓడించి అష్టదిక్పాలకులను సైతం తన ఆధీనంలో ఉంచుకున్న ధీశాలి. అయితే రాముడి చేత హతమవడానికి ముందు రావణుడు మరొకరి చేతిలో ఓడిపోయాడు. రావణుడిని ఓడించిన ఆ రాజు పేరు మాంధాత…
యవనాశ్యుని కుమారుడు మాంధాత..
భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించడంతో యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచే సాహసాలు చేసేవాడు. యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. మాంధాత ఎంత బలవంతుడంటే… తన 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు..అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సిద్ధమవుతాడు. ఇద్దరి మధ్యా భీకరమైన యుద్ధం జరిగింది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను అనుసరించినా…రావణుడు మాంధాతని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండా అలాగే పోరాటం కొనసాగించి చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓటమి పాలయ్యాడు. అప్పుటికి కానీ రావణుడికి మాంధాత బలమెంతో తెలియలేదు. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని... మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.
మాంధాత జన్మ వృత్తాంతం
ఇక్ష్వాకు వంశానికి చెందిన యువనాశ్వుడికి వందమంది భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. మునులు ఆయనతో ఇంద్రయాగం చేయించారు. అయితే భార్య తాగాల్సిన మంత్ర జలాలను పొరపాటున భర్త తాగడం వల్ల, యువనాశ్వుడి కడుపున చక్రవర్తి లక్షణాలతో కొడుకు జన్మించాడు. ఆ బాలుడికి ’మాంధాత’ అని పేరు పెట్టాడు ఇంద్రుడు. కొంతకాలం తరువాత యువనాశ్వుడు తపస్సు చేసి సిద్ధిని పొందాడు. పరిపూర్ణ యవ్వనాన్ని పొందిన మాంధాత రావణాది శత్రువులను జయించాడు. శ్రీమన్నారాయణుడిని ఆత్మలో నిలుపుకున్న మాంధాత ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. బిందుమతి అనే ఆమెను పెళ్లిచేసుకుని ముగ్గురు కుమారులు, ఏభైమంది కూతుళ్లను పొందాడు.
ఇంద్రయాగం చేసిన పుట్టిన మాంధాత స్వర్గాన్ని జయించి ఇంద్రసమానత్వం పొందాలని ఆశించాడు. ఆ విషయం తెలిసి దేవతలూ, ఇంద్రుడు కలత చెందారు. ఇంద్రుడితో సహా అర్థ సింహాసనం అధిష్టించాలన్నది మాదాత వాంఛ. ఇదే విషయాన్ని స్వర్గానికి వెళ్లి ఇంద్రుడికి తెలియజేశాడు. మాంధాత మాటలకు స్పందించిన ఇంద్రుడు…ముందుగా భూలోకం జయించిన తర్వాత ఇంద్రలోకం విషయానికి రా అని చెప్పి పంపించేశాడు. అయితే భూలోకంలో తాను జయించని వారెవరు? అని అడిగాడు మాంధాత. ‘మధువు కుమారుడు లవణుడు అని సమాధానం చెప్పాడు ఇంద్రుడు. లవణుడు పరమదుర్మార్గుడు. రాక్షసకృత్యాలతో ప్రజల్ని వణికిస్తున్నాడు… ముందు వాడి పనిపట్టి తన సింహాసనం గురించి ఆలోచించమని చెబుతాడు ఇంద్రుడు.
ఇంద్రుడి మాట మేరకు భూమ్మీదకు వచ్చిన మాంధాత లవణుడిపై దండయాత్రకు వెళ్లాడు. ముందుగా తన ఆధిపత్యాన్ని శిరసావహించాలని..లేదంటే యుద్ధం తప్పదనీ లవణుడి దగ్గరకు దూతను పంపాడు. లవణుడు మాంధాత మాట లక్ష్య పెట్టకపోవడమేకాక ఆ దూతను చంపేశాడు. అప్పుడు మాంధాత లవణుడితో యద్ధం చేశాడు. అయితే పరమశివుడు ప్రసాదించిన శూలాన్ని లవణుడు ప్రయోగించడంతో మాంధాత చనిపోయాడు. అయినప్పటికీ లంకాధిపతిని జయించడంతో చరిత్రలో నిలిచిపోయాడు మాంధాత.