Sri Ram Navami 2022: భక్త రామదాసుపై చిన్నచూపేల, ఇకనైన పలకవా రామచంద్రా
నిజాం ప్రభువు ఆదేశాలను ధిక్కరించి భద్రాచలంలో రామయ్యకి ఆలయాన్ని నిర్మించి భక్తాగ్రేసుడు, వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న. ఇంత గొప్ప భక్తుడిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటున్నారు నేలకొండపల్లి వాసులు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు నేలకొండపల్లి వాసులు.కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు. ఆ తర్వాత మాత్రం ఎప్పటిలానే పట్టించుకోకుండా వదిలేశారని నేలకొండపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పురాణ కాలంలో మహిళా సాధికారికతకు నిదర్శనం ఈ ఐదుగురు
కంచర్ల గోపన్న ( రామదాసు)భద్రాచలం తహసిల్దారుగా బాధ్యతల స్వీకరించిన తర్వాత భద్రాచలం కొండపై జీర్ణావస్థలో నున్న రామాలయాన్ని చూసి చలించిపోయాడు. తనకు శిక్ష పడుతుందని తెలిసినా శ్రీ రామచంద్రుడిపై ఉన్న భక్తితో ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసాడు. ఫలితంగా ఆగ్రహించిన తానీషా ప్రభువు చెరశాలకు పంపాడు. అలాంటి పరిస్థితుల్లో సాక్షాతు శ్రీ రామచంద్రుడే వచ్చి ఆరు లక్షల వరహాలు తానీషాకు చెల్లించి రామదాసుని విడుదల చేయించాడని ప్రతీతి. రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో ‘ఇక్ష్వాకుల తిలకా ఇకనైనా పలుకవూ రామచంద్రా” అనే రామదాసు కీర్తనలో కనబడుతుంది. ప్రాకారాలకు పది వేల వరహాలు, భరతునికి చేయించిన పచ్చల పతకానికి పది వేల వరహాలు, శత్రజ్ఞుడికి చేయించిన బంగారు మొలత్రాడుకు పదివేల మొహరీలు, లక్ష్మనుడికి చేయించిన పతకానికి పది వేల వరహాలు, సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి పది వేల వరహాలు...ఇలా ఓఆభరణాలకు ఎంతెంత ఖర్చు అయిందో ఏకరువు పెట్టాడు. రామదాసు కీర్తనలన్నీ బందిఖానాలోనే ప్రాణం పోసుకున్నాయి. అంత భక్రాగ్రేసుడు అయిన రామదాసు జన్మస్థలాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటున్నారు.
Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం
భక్త జయదేవుడు, త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, నారాయణ తీర్ధులు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య ..ఇలా ఎందరో కర్నాటక సంగీత జ్యోతిని వెలిగించిన వాగ్గేయకారుల సరసన రామదాసుకు సముచిత స్థానముంది. సాహిత్య పరిశోధనల్లో వెలుగు చూసిన ఆయన 206 కీర్తనలను కాలగర్భంలో కలసిపోకుండా రక్షించుకుంటూ ఆ కీర్తనలకు దేశవ్యాప్త ప్రచారం చేయాల్సి ఉందని... తిరువయ్యూరులో ఏటా ఆరాధన ఉత్సవాల్లానే..శ్రీరామనవమికి రామదాసు సంస్మరణ ఉత్సవాలు జరగాలన్నది నేలకొండపల్లి వాసుల చిరకాల వాంచ. పైగా అప్పుడెప్పుడో ధ్యానమందిరాన్ని నిర్మించి అలాగే వదిలేశాలని..అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదంటున్నారు. రామయ్యకు గుడికట్టించిన రామదాసుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవా రామచంద్రా అంటున్నారు నేేలకొండపల్లి స్థానికులు.