(Source: ECI/ABP News/ABP Majha)
Spirituality: ఏ కన్ను అదిరితే ఏమవుతుంది, పురాణాల్లో ఏముంది-సైన్స్ ఏం చెబుతోంది
ఆడవాళ్లకి కుడికన్ను అదిరితే కీడు సంభవిస్తుందని, మగవారికి ఎడమకన్ను అదిరితే కష్టాలు తప్పవంటారు. ఈ నమ్మకం ఇప్పటి కాదని రామాయణ కాలంలోనే ఉందని కూడా చెబుతారు. ఇంతకీ ఏ కన్ను అదిరితే ఏమవుతుంది...
కన్ను అదరడాన్ని శకునంగా భావిస్తారు. ఆడవారికి కుడికన్ను, మగవారికి ఎడమకన్ను అదరడం వల్ల అనార్థాలు జరుగుతాయని చాలా మంది నమ్మకం. సీతాదేవిని రావణాసురుడు అపహరించే ముందు ఆమెకు కుడికన్ను , లక్ష్మణుడికి ఎడమకన్ను అదిరాయట. రావణ సంహారానికి ముందు రాముడు లంకలోకి ప్రవేశించగానే రావణుడికి కుడి కన్ను, సీతకు ఎడమకన్ను అదిరాయట. రామదండు లంక మీద దాడి చేయబోయే ముందు రావణుడికి, మండోదరికి కూడా కన్ను అదరిందట. రామాయణ కాలం నుంచే కన్ను అదరడాన్ని పరిగణలోకి తీసుకుని శకునాలు అంచనా వేయడం ప్రారంభించారు.
Also Read: ఆంజనేయుడిని పూజిస్తే శనిప్రభావం ఎందుకు తగ్గుతుంది
కన్ను ఎందుకు అదురుతుంది
కంటి రెప్పలోని కండరాలు అసంకల్పితంగా సంకోచించినప్పుడు కన్ను కొట్టుకుంటుంది. ఇవి మూడు రకాలుగా పేర్కొంటారు.
1.మయోకిమియా: సాధారణంగా ఇది ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. కండరాల ఆకస్మిక సంకోచం వల్ల ఇలా ఏర్పడుతుంది. దిగువ కనురెప్పలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్వల్ప కాలమే ఉంటుంది.
2. హెమిఫేషియల్ స్పస్మ్, బ్లేఫరోస్పస్మ్: జన్యు సంబంధిత సమస్య వల్ల హెమిఫేషియల్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది శరీరంలోని అంతర్గత సమస్యలను సూచిస్తుంది.
3.బ్లేఫరోస్పస్మ్: ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. ఇది సెకన్లు, నిమిషాలే కాదు, కొన్నిసార్లు గంటల సేపు కళ్లు అదురుతూనే ఉంటాయి.
Also Read: గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు
కన్ను అదరడానికి కారణాలు
- మెదడు లేదా నరాల లోపాల వల్ల కన్ను అదురుతుంది. అయితే, ఇది చాలా అరుదైన లక్షణం.
- చాలామందిలో అధిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
- ఎక్కువ సేపు టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లను చూసినా కళ్లు ఒత్తిడికి గురవుతాయి
- చాలామందిలో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి.
- కాఫీ లేదా చాక్లెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందట.
- కళ్లు పొడిబారినా సరే ఈ సమస్య ఏర్పడుతుంది.
- మద్యం అతిగా తాగేవారిలో కూడా కన్ను అదిరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
మీ కన్ను పదే పదే అదురుతుంటే....శకునం పేరుతో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. అంతేకానీ కుడికన్ను అదిరితే మగవారికి శుభశకునం, ఎడమకన్ను అదిరితే ఆడవారికి శుభశకునం అని ధీమాగా వ్యవహరించవద్దు. ఏది ఎంతవరకూ నమ్మాలో అంతవరకే నమ్మాలి.