Spirituality: వైకుంఠ ద్వారపాలకులు విష్ణు మూర్తికి ఎందుకు విరోధులయ్యారు? మూడు జన్మలనే ఎందుకు ఎంచుకున్నారు?
Spirituality: శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి చదివినప్పుడు జయ విజయులు అనే పేరు వినే ఉంటారు. ఆ ఇద్దరూ వైకుంఠ ద్వారపాలకులు. ఆ తర్వాత వాళ్లే శ్రీ మహావిష్ణువుకి బద్ద శత్రువులుగా మారిపోయారు..ఎందుకంటే

Spirituality: జయవిజయులు ఇద్దరూ విష్ణుమూర్తి వైకుఠంలో కావలివారుగా ఉండేవారు. ఇప్పటికీ విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి ఆలయంలో కూడా వీరి విగ్రహాలు ఎంట్రెన్స్ దగ్గర ఉంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడాళ్వర్ ఎదురుగా ఉంటారు. నిత్యం స్వామివారి సేవలో మునిగి తేలే మహాభక్తులు శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా ఎందుకు మారాల్సి వచ్చింది...అసలేం జరిగింది...
ఒక రోజు బ్రహ్మ మానసపుత్రులు వైకుంఠం వస్తారు. వారి పేర్లు సనక, సనత్క్ మార, సునంద, సనత్సు జాతులు. వీళ్లంతా శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చి మొదట ఆరు ద్వారాలను తమ మహిమతో దాటుకుని వెళ్తారు. ఏడో ద్వారానికి రాగానే వారిని..పరమ భక్తులైన జయవిజయులు కనిపెడతారు. తాము విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చామని చెబుతారు. అయితే జయ, విజయలు ఆ మానసపుత్రులను లోపలికి పంపించరు. వాళ్లంతా తమ గురించి వివరించుకున్నప్పటికీ జయవిజయులు అడ్డుపడతారు. ఆగ్రహించిన ఆ మహానుభావులు... భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపిస్తారు. అప్పుడే వీరొచ్చిన విషయం శ్రీ మహావిష్ణువుకి తెలియడంతో ఆయన స్వయంగా ద్వారం దగ్గరకు వచ్చి బ్రహ్మ మానసపుత్రులను లోపలకు ఆహ్వానిస్తాడు. ద్వారం వరకూ వచ్చిన విష్ణుమూర్తికి నమస్కరించిన జయవిజయులు..మునులు ఇచ్చిన శాపం గురించి చెప్పి శాపవిమోచనం కల్పించాలని వేడుకుంటారు. అప్పడు శాప ఫలితం నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదన్న శ్రీ మహావిష్ణువు ఓ పరిష్కారం చెప్పాడు.
1.హితులుగా ఏడు జన్మలు భూలోకంలో ఉంటారా
2. విరోధులుగా మూడు జన్మలు శాఫఫలితాన్ని అనుభవిస్తారా
Also Read: భర్త భార్యను- భార్య భర్తను హింసిస్తే గరుడ పురాణం ప్రకారం శిక్షేంటో తెలుసా!
హితులుగా అయినా ఏడు జన్మలు మీకుసేవ చేసే అదృష్టానికి దూరంగా ఉండలేం అన్న జయ విజయులు విరోధులుగా మూడు జన్మలు కావాలని కోరుకుంటారు. ఆ ద్వార పాలకులే వరుసగా మూడు జన్మల్లో శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా జన్మించారు..
మొదటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు
హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా జన్మించి శ్రీ మహావిష్ణువుని ద్వేషిస్తారు. హిరణ్యకశిపుడి కడుపున పుట్టిన ప్రహ్లాదుడు నారాయణుడి భక్తుడు. కొడుకుతో వాదోపవాదనకు దిగిన హిరణ్య కశిపుడు ఏడీ నీ స్వామి ఎక్కడైనా ఉన్నాడని చెబుతావ్ కదా ఈ స్తంభంలో చూపించు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారంలో వచ్చి హిరణ్య కశిపుడిని సంహరిస్తాడు. వరాహ అవతారం ఎత్తి హిరణ్య కశిపుడిని సంహరించాడు.
రెండో జన్మలో రావణుడు, కుంభ కర్ణుడు
ఈ జన్మలో రావణుడు, కుంభకర్ణుడిగా జన్మించి..విష్ణుమూర్తి అవతారం అయిన రాముడి చేతిలో హతమయ్యారు
Also Read: కార్తీకమాసం ఎప్పటితో ఆఖరు, పోలిపాడ్యమి రోజు ఇలా చేస్తే పుణ్యం మొత్తం మీదే!
మూడో జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రలు
ఈ జన్మలో కూడా విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యారు...
అలా మూడు జన్మల్లో శ్రీ మహావిష్ణువు విరోధులుగా జన్మించి శాపఫలితాన్ని అనుభవించి తమ స్వామి చేతిలోనే హతమయ్యారు. చివరకు కలియుగంలో శాపం నుంచి విముక్తి లభించి అప్పటి నుంచి మళ్లీ వైకుంఠానికి ద్వారపాలకులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రతి వైష్ణవ ఆలయంలోనూ గర్భగుడి బయట ఇరువైపులా ఉండే విగ్రహాలు జయ విజయులవే... ముందుగా వీరిని చూసిన తర్వాతే స్వామివారి దర్శనం లభిస్తుంది...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

