Spirituality: మగాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి, ఆధ్యాత్మిక కారణాలేంటి - సైన్స్ ఏం చెబుతోంది!
మనిషి శరీరానికి మధ్యలో కట్టే తాడునే మొలతాడు అంటారు. హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ అంతర్లీనంగా శాస్త్రీయ కారణాలు ఉంటాయి. మొలతాడు కట్టుకోవడం కూడా ఇందులో భాగం అనే చెప్పాలి...
చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలతాడు పట్టుదట్టి
సందె తాయతులును సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు
నడుముకు బంగారు మొలతాడు, పట్టువస్త్రాన్ని ధరించిన మనోహరమైన చిన్ని కృష్ణుని రూపం ఇందులో ఆవిష్కరమైంది.
ధర్మ సింధువు ప్రకారం
మౌంజీం యజ్ఞోపవీతంచ నవదండంచ ధారయేత్
అజినం కటి సూత్రంచ నవ వస్త్రం తదైవచ ॥
'దర్భ త్రాడును, జంధ్యాన్ని , ఊతగా వాడే మోదుగ కఱ్ఱను, జింక చర్మాన్ని, మొలత్రాడును, వస్త్రాన్ని..ఏటా విధిగా కొత్తవి ధరించాలని అర్థం.
ఇందులో 'కటిసూత్రం' అంటే మన భాషలో మొలతాడు అన్నమాట. ఇది ఆరోగ్య భద్రతకోసం ఏర్పాటు చేసిన పురుష ఆభరణం. మన శరీరం 'దేవ-రాక్షసాలు'(రెండు భాగాలు)గా ఉంటుంది. నడుము పైభాగం దేవభాగమైతే, తక్కిన భాగమంతా రాక్షసభాగం. దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతోగానీ లేదా అంతకంటే శ్రేష్ఠమైన నవరత్నాలతోగానీ అలంకరించుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. రాక్షసభాగానికి వెండిని వాడుకోవడం ఆచారం. నడుము సంగమస్థానం కనుక స్థాయినిబట్టి వెండి, బంగారం లేదా తాడుని వినియోగించవచ్చు.
సాధారంగా నలుపు,ఎరుపు దారంతో మొలతాడు కట్టుకుంటారు. కొందరు వెండి, బంగారంతో తయారు చేయించుకుని కట్టుకుంటారు. మొలతాడు మార్చాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగిస్తారు కానీ ఒక్క క్షణం కూడా మొండి మొలతో ఉండకూడదు అని చెబుతారు.ఎందుకు, ఏంటి అనేది తెలియాలంటే దీనివెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలి..
- మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు. దీని వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని భావిస్తారు
- ముఖ్యంగా దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటూ రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే.
- శరీరాన్ని మధ్యాగా బాహ్యరూపంలో విభజించి చూపిస్తుంది. మొలతాడు కట్టిన పై భాగం అలంకారం,పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్ధం
- కొందరికి జాతక రీత్యా ఉండే దోషం తగ్గేందుకు కూడా తాయెత్తులు మొలకు కట్టేవారు
- నల్లటి తాడుని మొలకి కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు
- చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు ,కండరాలు సరియైన పద్ధతిలో వృద్ధిచెందుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మగపిల్లలకు జనన అవయయం ఆరోగ్యంగా పెరుగుతుంది
- చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టినా పెద్దవారైన తర్వాత కేవలం పురుషులు మాత్రమే మొలతాడు వినియోగిస్తారు
- పెళ్లైన స్త్రీకి మెడలో మంగళసూత్రంలా ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. అందుకే అప్పట్లో మొలతాడు లేని పురుషులను...భార్య చనిపోయిందా అని అడిగేవారట...
- ఇప్పుడంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్ కి వెళుతున్నాం కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ముఖ్యంగా విష పురుగులు ఏవైనా కుట్టినప్పుడు వెంటనే మొలతాడు గట్టిగా బిగించి విషం పైకి ఎక్కకుండా చేసి బయటకు తీసేవారు
- మొలతాడును ధరించడం వల్ల మనం తినే ఆహారంపై కంట్రోల్ ఉంటుంది. కాస్త ఎక్కువ తిన్నాసరే... మొలతాడు బిగుసుకుపోతుంది. అంటే మనం తినాల్సినదానింటే ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది. బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలు ఇస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇలా బరువు అదుపులో ఉంటుంది, జీర్ణక్రియ మెరుగు పడుతుంది, బానపొట్టని నివారిస్తుంది.
- మొలతాడు ధరించేవారికి హెర్నియా రాదని చెబుతారు. పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మొలతాడు కట్టుకోవడం మంచిదంటారు
- చిన్న పిల్లల మొలతాడుకి తాయెత్తులు కట్టేవారు. ఆ తాయెత్తులో బొడ్డుతాడు మూలకణాలు పెట్టి వాటికి పసరు మందులు పూసి కట్టేవారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. భవిష్యత్ లో వచ్చే ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు సొల్యూషన్. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీలా. అందుకే బొడ్డుతో తాయెత్తు చేసి..ఇప్పుడు కొందరు బొడ్డు మువ్వ అంటున్నారు. దాన్ని మొలతాడుకి కడుతున్నారు.
ఇలా హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం, పద్ధతి వెనుకా శాస్త్రీయకారణాలు ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం అంటారు పండితులు....
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే