Ujjaini Mahankali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా? 1813లో ఏం జరిగింది?
లష్కర్ బోనాలు అనగానే గుర్తొచ్చే ఆలయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రానికి బీజం పడింది ఎప్పుడు? ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం
Ujjaini Mahankali Temple History: లష్కర్ బోనాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఈ పేరు సుపరిచితం. హైదరాబాద్ బోనాలు అనగానే లష్కర్ బోనాలు అనే పేరు మార్మోగిపోతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల పండుగనే లష్కర్ బోనాలుగా పిలుస్తారు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారని భక్తలు నమ్మకం. అందుకే, తమను, తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ మహంకాళి అమ్మవారికి పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. అయితే, సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర
బ్రిటిష్ ఆర్మీలో పని చేసే ఓ ఉద్యోగి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ.. ఆర్మీ ఉద్యోగికి, ఆలయ నిర్మాణానికి ఏంటి సంబంధం? అనే అనుమానం అందరికీ కలుగుతుంది. అసలు విషయం ఏంటంటే.. సికింద్రాబాద్ లోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య బ్రిటీష్ ఆర్మీలో పని చేసేవారు. తొలుత సికింద్రాబాద్ లోనే ఉద్యోగం చేసిన ఆయన, 1813లో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆయన అక్కడ విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే.. ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి విజృంభించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని తన సహోద్యోగులతో కలిసి అప్పయ్య దర్శించుకున్నారు. కలరా వ్యాధి తగ్గి, ప్రజలు సంతోషంగా ఉంటే, తన సొంతూరులో ఉజ్జయిని అమ్మవారి గుడి కటిస్తానని మొక్కుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. చాలా మంది ప్రజలు కలరా నుంచి కోలుకున్నారు.
1815లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ నిర్మాణం
ఉజ్జయిని అమ్మవారి కటాక్షం కారణంగానే కలరా వ్యాధి తగ్గిందని అప్పయ్యతో పాటు ఆయన వెంట ఉన్న మిత్రులు భావించారు. సుమారు రెండు సంవత్సరాల తర్వాత అంటే, 1815లో అప్పయ్య సికింద్రాబాద్ కు వచ్చారు. ఉజ్జయినిలో తాను మొక్కిన మొక్కు గురించి కుటుంబ సభ్యులకు చెప్పారు. బంధుమిత్రుల సహకారంతో పాతబోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. పూజలు మొదలు పెట్టారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్న సమయంలో ఆషాఢమాసం కావడంతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనూ ఆషాఢంలో జాతర నిర్వహించాలని అప్పయ్య నిర్ణయించారు.
జాతరకు వచ్చే భక్తలకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న బావికి మరమ్మతులు చేయిస్తుండగా మాణిక్యాల అమ్మవారి విగ్రహం దొరికింది. ఆ ప్రతిమను కూడా అమ్మవారి పక్కనే పెట్టి మాణిక్యాల అమ్మవారిగా పేరు పెటారు. ఆ తర్వాత అప్పయ్య కుటుంబ సభ్యులు ఆధునిక ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అమ్మవారి విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తుంది.
1815 నుంచి ఆషాఢమాసంలో బోనాల జాతర
అప్పయ్య గుడి నిర్మించిన నాటి నుంచి అంటే, 1815 నుంచి ఆషాఢమాసంలో ప్రతి ఏటా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటే, అంటు వ్యాధులు సోకుండా కాపాడటంతో పాటు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండేలా చూస్తుందని భక్తుల నమ్మకం. అందుకే, లష్కర్ బోనాల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
Read Also: బావిలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ- 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ తెలుసా?