Balkampet Yellamma Temple: బావిలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ- 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ తెలుసా?
భాగ్యనగరంలోని పురాతన ఆలయాలలో బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు, కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తోంది.
![Balkampet Yellamma Temple: బావిలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ- 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ తెలుసా? What is the story behind Hyderabad Balkampet Yellamma Temple Balkampet Yellamma Temple: బావిలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ- 700 ఏళ్ల నాటి ఆలయ మహిమ తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/f019c721be7d7fa0a562add52b6dda9e1720693199796544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Balkampet Yellamma Temple History: హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు. ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఆషాఢ మాసం రాగానే భాగ్యనగరం ముఖానికి పసుపు పూసుకుని, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండువగా జరుగుతాయి. బోనాల సందర్భంగా అమ్మవారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
నెల రోజుల పాటు అత్యతం వైభవంగా వేడుకలు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసంలో నెల రోజులు బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది, మంగళవారాలు ఎంతో ఇష్టం. ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి, ఒడి బియ్యం పోస్తారు. చీర సారెలతో అమ్మవారిని కొలుస్తారు. నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతాయి. ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాడ మాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా జులై 9న అమ్మవారి కల్యాణం వైభవంగా జరిపించారు. ఎల్లమ్మ తల్లికి మహాదేవ శివయ్యతో ఆలయ పండితులు కల్యాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అమ్మవారి కల్యాణాన్ని కళ్లారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగకముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. యువతీ యువకులకు కల్యాణ యోగం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు.
అమ్మవారి ఆలయం వెనుక 700 ఏళ్ల చరిత్ర
బల్కంపేట ఎలమ్మ ఆలయం వెనుక ఏన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంటపొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా, అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్లోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని, దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి, ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలి వచ్చారు. గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు.
1919లో ఆధునిక దేవాలయం నిర్మాణం
బల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం 1919లో జరిగింది. అప్పుడు ఈ ప్రాంత సంస్థానాధీషుడిగా ఉన్న రాజా శివరాజ్ బహద్దూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు. ఆలయంలో అమ్మవారు స్వయంభూ మూర్తిగా కొలువుదీరారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ జలాన్ని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయం అవుతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని భావిస్తారు.
Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి.. ఇదిగో నిజం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)