Tossing Coins In River: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రాలుంటాయి. దేవుడితో ముడిపెట్టి చెబితో అప్పటి తరం శ్రద్ధగా అనుసరించేవారు. అయితే నేటి తరం కూడా ఫాలో అవుతోందే కానీ వాటి వెనుకున్న ఆంతర్యాన్ని తెలుసుకోలేకపోతోంది.
నదిలో నాణేలు వేయడం వెనుక ఆంతర్యం ఏంటంటే….
హిందూ సంప్రదాయంలో ఎన్నో పద్ధతులు పాటిస్తారు…ఎన్నో నియమాలు అనుసరిస్తారు. అందులో ప్రతి నియమం వెనుక, ప్రతి పద్ధతి వెనుక శాస్త్రీయ కోణం ఉంటుంది. పూర్వకాలంలో శాస్త్రీయ కోణం గురించి చెబితే చాలామందికి అర్థమయ్యే పరిస్తితి లేకపోవడంతో…. దేవుడి పేరు చెప్పి ఆ పద్ధతులు పాటించేలా చేస్తున్నారు. అప్పటి వారు తమ తర్వాతి తరం వారు కూడా అవే అనుసరించేలా సూచిస్తూ వచ్చారు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం పాటించాలనే చాదస్తం తప్ప వాటివెనుకున్న ఆంతర్యాన్ని గుర్తించడం లేదు….
పుష్కరాల సమయంలో అయినా, గ్రహణ స్నానాల సమయం, ప్రయాణం చేసేటప్పడు మార్గ మధ్యలో నది కనిపించినా… ఇలా రకరకాల సందర్భాల్లో ఆయా నదుల్లో నాణేలు వేసి నమస్కారం చేస్తుంటాం. చిన్నా-పెద్దా అందరూ చిల్లర పైసలు వేసి నమస్కరిస్తారు కానీ ఎందుకలా చేస్తామనే కారణం చాలామందికి తెలియదు.
చాలా మంది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు, నది, సరస్సుల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలు వేస్తుంటారు. అయితే నదుల్లో వేయాల్సింది ఇప్పుడు చలామణిలో ఉన్న నాణేలు కాదు రాగి నాణేలు వేయాలి. ఇప్పుడున్న రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఇనుముతో తయారుచేసినవి. కానీ అప్పట్లో నాణేలన్నీ కేవలం రాగితోనే తయారు చేసేవారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుంది. అందుకే అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు.
రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలు ఉన్నా తొలగిపోతాయని అలా చేసేవారు. పైగా అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు. ఇప్పటిలా ఫిల్టర్లు లేవు. అందుకే రాణి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు.
ఇప్పుడున్న నాణేలు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సరికదా మరింత నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ఆ చిల్లర పైసలు ఏరుకునేందుకు నదుల్లో దూకి కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇకనుంచైనా ప్రస్తుతం చలామణిలో ఉన్న ఇనుప నాణేలు నీటిలో వేయొద్దు. రాగి నాణేలు దొరికితే మాత్రం నిరభ్యంతరంగా వేయండి. ఇక అమితమైన భక్తితో కొబ్బరి కాయలు కొట్టి కూడా నదిలోకి విసిరేస్తుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల కూడా నదిలో నీళ్లు పాడవుతాయి.
ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాం. చేతురాలా ప్రకృతిని నాశనం చేసి వినాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాం. మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాల వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. కానీ వాళ్లని అనసరించామన్న పేరుతో మరింత అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించండి. నాటి సంప్రదాయాలను అనుసరించడం మంచిదే అయినా ఎలా చేయాలి…ఎందుకు చేయాలి.. వాటివెనుకున్న ఆంతర్యం ఏంటన్నది తెలుసుకోండి….