Krishna Temple: చేతిలో వెన్నముద్ద తో కనిపించే బాలకృష్ణుడి ఆలయం, ప్రపంచంలో ఇంకెక్కడా లేని అరుదైన విగ్రహం, మన తెలుగు నేల పైనే!
చేతిలో వెన్నముద్ద తో కనిపించే బాలకృష్ణుడి ఆలయం... ప్రపంచంలో ఇంకెక్కడా లేని అరుదైన విగ్రహం..మన తెలుగు నేల పైనే ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం...

Venna Mudda Balakrishna Swamy Temple : తెలుగు నేలపై వందల ఏళ్ల నాటి అరుదైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుంటూరు జిల్లాలో ఉంది. అదే చారిత్రిక కొండవీడు కోటకు సమీపంలో ఉండే నవనీత బాల కృష్ణ స్వామి ఆలయం.

చేతిలో వెన్న ముద్దతో.. పాకుతూ కనిపించే బాలకృష్ణుడు
కొండవీడు కోట కింద 'చెంగిజ్ ఖాన్ పేట 'అనే చిన్న గ్రామం ఉంది. దీనిని ఒకప్పుడు 'సింగని సాని పేట ' అని పిలిచేవారట. ఇక్కడ ఉండే "నవనీత బాల కృష్ణ స్వామి ఆలయం " లో విగ్రహం చాలా అరుదైనది. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి కృష్ణుడి విగ్రహం లేదు. కుడి చేతిలో వెన్నెముద్దను బంతిలా పట్టుకుని ఎడమ చేతిలో వెన్న గిన్నె పట్టుకుని పాకుతూ వస్తున్నట్టు ఉండే ఈ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. రెండున్నర అడుగుల ఎత్తు మూడు అడుగుల పొడవు ఉండే ఈ విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. వందల ఏళ్ల నాటి ఈ ఆలయం చూడడానికి చాలా సాధారణంగా ఉంటుంది. ఆలయంలోపలకి అడుగు పెట్టగానే ఆలయ వృక్షం భారీ జమ్మిచెట్టు చిన్న మండపం స్వాగతం పలుకుతాయి. ఆలయ మండపంలో నీలి రంగులో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక గుడిలోని బాల కృష్ణ స్వామి మెడలో పులిగోరు పతకం ఉండడం విశేషం.

శ్రీ కృష్ణ దేవరాయలు తెచ్చిన విగ్రహం ఇది
కొండవీటి కోటను జయించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు అక్కడ గుడి కట్టించి హంపి నుంచి తీసుకువచ్చిన బాల కృష్ణుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు గోల్కొండ సుల్తానుల దాడి చేస్తారేమో అనే భయంతో బాలకృష్ణుడి విగ్రహంతో సహా ఇతర దేవతామూర్తులను భూమిలో పాతిపెట్టారు స్థానిక పూజారులు. 1712 నాటికి ఆ ప్రాంతం చిలకలూరిపేట జమీందారుల చేతిల్లోకి వెళ్ళింది. ఆ జమీందారుల్లో ఒకరైన మానూరి వెంకట హనుమంత రావు ఆలయాన్ని పునరుద్ధరించి విగ్రహాలు ప్రతిష్టించి నిర్వహణ కోసం భూములను దానం చేశారని స్థలపురాణం. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. భారీగా భక్తులు తరలివస్తారు.

ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి?
గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో దారిలో ఫిరంగిపురం వస్తుంది. అక్కడనుండి 10 కిలోమీటర్ల దూరంలో హెచ్ంగిస్కాన్ పేట ఈ చెంగిజ్ ఖాన్ పేట ఉంటుంది. ఈ గుడి తో పాటు కొండవీటి కోటను చూడడానికి ఒక రోజు సరిపోతుంది. ఒకటి రెండిటిని కలిపి ప్లాన్ చేసుకుంటే ఒక మంచి టూరిజం ట్రిప్ అవుతుంది. అయితే ఇక్కడ సౌకర్యాలు తక్కువ కాబట్టి నీరు ఆహారం వెంట తీసుకుని వెళ్లడం మంచిది.
దుఃఖాన్ని దూరం చేసే కృష్ణ గాయత్రి మంత్రం
ఓం దామోదరాయ విద్మహే,
రుక్మిణీ వల్లభయ ధీమహి,
తన్నో కృష్ణః ప్రచోదయాత్”
ॐ దామోదరాయ విద్మహే,
రుక్మణీవల్లభాయ ధీమహీ,
తన్నో కృష్ణ ప్రచోదయాత్ ॥
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి





















