Margashira Masam 2023: మార్గశిరమాసం గురువారం చదువుకోవాల్సిన ఐదువారాల వ్రతకథ ఇదే!
Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి ప్రారంభమయ్యే మార్గశిరమాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అంటారు. ఈ నెలలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకం ...ఈరోజు పూజ అనంతరం చదువుకోవాల్సిన కథ ఇదే..
Margashira Masam Mahatmyam Story in Telugu: ‘మాసానాం మార్గశీర్షాహం’ అని చెప్పాడు శ్రీ కృష్ణభగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్ఠమైనదనీ, ఉపయోగకరమైనదనీ అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడుతోపాటూ భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ గీతలో చెప్పాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదం. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ముఖ్యంగా మార్గశిరమాసం గురువారాల్లో లక్ష్మీ పూజ అత్యుత్తమం. దీనినే ఐదువారాల వ్రతం అని కూడా అంటారు.ఈ రోజున లక్ష్మీపూజ చేసిన తర్వాత...తప్పనిసరిగా ఓ కథ చదువుకోవాలి...
Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!
మార్గశిర లక్ష్మీవార వ్రత కథ
పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనం లోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి దగ్గర పెరుగుతుంది. తనకి పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతితల్లి సుశీలకి బెల్లం ఇచ్చేది. ఓ వైపు పిల్లల్ని ఆడిస్తూనే..సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల..మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లేడుపూలు, ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకి ఆమెకు పెళ్లికావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను తీసుకుని అత్తవారింటికి వెళ్లింది. అయితే సుశీల అత్త వారింటికి వెళ్ళినప్పటి నుంచీ కన్నవారింట కష్టాలు మొదలయ్యాయి. అలాంటి పరిస్థితిలో అక్క ఇంటికెళ్లి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తనయుడిని పంపిస్తుంది సవతి తల్లి. పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల.. ఓసారి వెదురు కర్రలో వరహాలు పెట్టిస్తుంది, మరోసారి వరహాల మూట ఇస్తుంది, ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి ఇస్తుంది. అయితే ఆ మూడుసార్లు మార్గమధ్యలో ఆ ధనం పోగొట్టుకుని ఒట్టి చేతులతోనే ఇంటికెళతాడు సుశీల సోదరుడు. కొన్నాళ్లకి స్వయంగా సవతి తల్లి కుమార్తె ఇంటికి వెళుతుంది. అమ్మా..ఈ రోజు మార్గశిర లక్ష్మివారం వ్రతం చేసుకుందాం అని చెబుతుంది. అయితే పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోటిలో వేసుకోవడంతో నోముకి పనికిరాదు. రెండో వారం పిల్లలకు నూనె రాస్తూ ఆమె రాసుకుంటుంది, మూడోవారం చిక్కులు తీసుకుని తలదువ్వుకుంటుంది, నాలుగోవారం అరటిపండు తినేస్తుంది. విసిగిపోయిన కుమార్తె ఐదోవారం తల్లి వెన్నంటే ఉండి వ్రతం చేయిస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి కరుణ లభించదు. సుశీల ప్రార్థించగా.. నీ చిన్నతనంలో మీ అమ్మ చీపురుతో కొట్టిందని అందుకే ఆ ఇంట ఉండలేనంటుంది లక్ష్మీదేవి. తప్పు క్షమించమని వేడుకున్న సుశీల తల్లితో నిష్టగా మార్గశిర లక్ష్మివారం వ్రతం చేయిస్తుంది. అప్పటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
Also Read: కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు డిసెంబరు 18న ఇలా చేయండి!
మార్గశిర లక్ష్మివారం వ్రతం చేసేవారు అమ్మవారి పూజ, నైవేద్యం అనంతరం ఈ వ్రతకథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. వ్రతం తప్పినా భక్తి ప్రధానం అన్న విషయం మరిచిపోరాదని చెబుతారు పండితులు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!