Makar Sankranti 2025: పుణ్య స్నానం, దానం చేసేందుకు మకర సంక్రాంతి రోజు శుభసమయం ఇదే!
Makar Sankranti 2025 Date and Time: తెలుగువారి అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ రోజు చేసే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. సంక్రాంతి శుభముహూర్తం ఎప్పుడంటే..
Makar Sankranti 2025 Date Pooja Time: హిందువుల పండుగలలో ముఖ్యమైనది..తెలుగువారికి అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు తన దిశను దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు మార్చుకుంటాడు. ఉత్తరాయణం మొదలయ్యే ఈ సమయం దేవతలకు రాత్రి పూర్తై సూర్యోదయం అయ్యే సమయం. దేవతలు నిద్రలేచే ఈ సమయాన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఇంత విశేషమైన రోజు చేసే స్నానం, దానం అనంత ఫలితాన్ని అందిస్తాయి. 2025 లో మకర సంక్రాంతి జనవరి 14 మంగళవారం వచ్చింది. ఈ రోజు స్నానం, దానం చేసేందుకు పుణ్యకాలం ఎప్పుడంటే..
- జనవరి 14 మంగళవారం మకర సంక్రాంతి - ఉత్తరాయణం ప్రారంభం
- పాడ్యమి తిథి - మంగళవారం రాత్రి 3.28 నిముషాలవరకూ ఉంది..అంటే తెల్లవారితే బుధవారం
- శ్రీరామచంద్రుడి నక్షత్రం అయిన పునర్వసు ఉదయం 10.52 వరకు ఉంది
- అమృత ఘడియలు ఉదయం 8.28 నుంచి 10.03 వరకు ఉన్నాయి తిరిగి రాత్రి తెల్లవారుజామున 4.43 నుంచి 6.20వరకు
- దుర్ముహూర్తం ఉదయం 8.51 నుంచి 9.35 వరకు తిరిగి రాత్రి 10.49 నుంచి 11.41 వరకు
- సూర్యోదయం ఉదయం 6.38
- సూర్యాస్తమయం సాయంత్రం 5.40
సూర్యోదయానికి ముందే స్నానమాచరించి..సూర్యభగవానుడికి అర్ఘ్యం విడిచిపెడతారు. వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయంలో పెద్దలను తర్పణాలిస్తారు. పెద్దలను పూజిస్తారు. మకర సంక్రాంతి రోజు పెద్దలను పూజించాల్సిన పుణ్యకాలం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.
Also Read: ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్..కుంభమేళా ఈ 4 ప్రదేశాల్లోనే ఎందుకు!
దేశవ్యాప్తంగా మకర సంక్రాంతిని విశేషంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో , విభిన్న సంప్రదాయాలను అనుసరించి పండుగ చేసుకుంటారు. ఈ రోజు పిండివంటలు ఇరుగు పొరుగు పంచుకుంటారు. శక్తికొలది దానాలు చేస్తారు. చలికాలం కావడంతో దుప్పట్లు, దుస్తులు దానం చేస్తారు. వీటితో పాటూ పిండి వంటలు, నువ్వులు, లడ్డూలు పంచిపెడతారు.
ఈ ఏడాది మకర సంక్రాంతికి ఓ రోజు ముందు భోగి నుంచి కుంభమేళా ప్రారంభమవుతోంది. సంక్రాంతి పర్వదినం, కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు పోటీపడతారు. సాధారణంగా సంక్రాంతి రోజు నదీస్నానం ఉత్తమం.. అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళా జరిగే ప్రదేశాల్లో నదీస్నానం ఆచరించడం మరింత పుణ్యఫలం అంటారు పండితులు.
మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడు తన దిశను మార్చునే సమయంలో శని దేవుడి గృహంలో సంచరిస్తాడని చెబుతారు. సూర్యుడి తనయుడు శని. మకర సంక్రాంతి రోజు శనిని పూజించడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయని..అందుకే ఈ రోజు నదీ స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటూ శని భగవానుడిని స్మరించాలని చెబుతారు. నువ్వులు దానం చేయడం, నువ్వులతో చేసిన పిండివంటలు పంచిపెట్టడం ఈ కోవకే చెందుతుంది.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవి
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!