(Source: ECI/ABP News/ABP Majha)
Mahabharat Duryodhan: కేరళలో దుర్యోధనుడి పేరుమీద వంద ఎకరాల పొలం
దుర్యోధనుడి పేరు మీద పొలం ఉండడం ఏంటి, పొరపాటు పడ్డారా లేదా ఎవరైనా పొరపాటున ఆ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారా అని వరుస ప్రశ్నలు వేయకండి… ఎందుకో ఏంటో వివరాలు చూడండి..
మహాభారతంలో దుర్యోధనుడనగానే దుష్టుడు, దుర్మార్గుడు, తమ్ముళ్లకు ఆస్తులివ్వకుండా అడవులపాలు చేశాడు, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు...ఇలా అన్నీ నెగెటివ్ మాటలే వినిపిస్తాయి. కానీ దుర్యోధనుడిని మరికొందరు స్నేహానికీ, అభిమానానికీ ప్రతీకగా భావించి దేవుడిగా కొలిచేవారున్నారు. ఏకంగా దుర్యోధనుడికి ఆలయం కట్టారని తెలుసా.
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో పోరువళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం.
ఈ ఆలయం గురించి ఏం చెబుతారంటే..
కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్నీ, ఏడాది అజ్ఞాతవాసాన్నీ అనుభవించేందుకు అడవుల బాట పడతారు. అయితే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కుంటే మళ్లీ వాళ్లు మొదటి నుంచి అంటే మరో 12 ఏళ్లు అరణ్యవాసాన్ని చేయాల్సి ఉంటుంది. అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు వెళతాడు. అలా వెళ్తూ వెళ్తూ కేరళలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట.
Also Read: పగ నాలుగు రకాలు, ఎవ్వరిపైనా అతివిశ్వాసం వద్దు, ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన కథ ఇదే
ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది. చాలాసేపు చుక్క మంచినీరు కూడా దొరకలేదు. దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు ఓ కల్లు కుండ అందించింది. కల్లు రుచి చూసిన దుర్యోధనుడు సంబరపడిపోయాడట. అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని, ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడై ఆ కొండను సుభిక్షంగా ఉంచమని కోరుతూ పరమేశ్వరుడిని ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడట. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డుల్లో దుర్యోధనుడి పేరు మీదే ఉంటుందని అంటారు. ఆ కృతజ్ఞతతో ఆ కొండపైనే స్థానికులు దుర్యోధనుడి ఆలయాన్ని నిర్మించారు.
Also Read: తమ్ముళ్లని కాదని కుక్కని సపోర్ట్ చేసిన ధర్మరాజు .. ఆనందించిన తండ్రి యమధర్మరాజు..
విగ్రహం లేని ఆలయం
ఆలయాన్ని నిర్మించారు కానీ దుర్యోధనుడి విగ్రహం నిర్మించలేదు. ఆ గుడిలో ఓ ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే కనిపిస్తుంది. ఆ గుడిలో అడుగుపెట్టిన భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. ఈ ఆలయంలోని ‘కురవ’ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా ఉంటార. ఎందుకంటే అప్పట్లో దుర్యోధనుడికి కల్లు అందించిన వృద్ధురాలు ‘కురవ’ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలైందట. నిత్యం ఈ ఆలయంలో భక్తుల సందడి ఉంటుంది. ముఖ్యంగా మార్చిలో జరిగే ‘కెట్టుకజ’ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది జనం తరలివస్తారట. వెదురుతో 70, 80 అడుగుల ఎత్తు తొట్టెలు చేసి వాటిని అలంకరించి భుజాన మోస్తారు.