Hanumath Vratham 2024: మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్ర్వతం - ఈ రోజు హనుమాన్ ను పూజించాల్సిన విధానం ఇది!
Jai Hanuman: హనుమాన్ విజయోత్సవం, హనుమాన్ జయంతి మాత్రమే కాదు.. ఆంజనేయుడికి సంబంధించిన మరో ముఖ్యమైన రోజు హనుమద్ర్వతం. ఈ వ్రతం ఎవరెవరు ఆచరించాలి..ఏ ఫలితాన్ని పొందారో తెలుసా!
Hanumath Vratham 2024: మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్ర్వతం - ఈ రోజు హనుమాన్ ను పూజించాల్సిన విధానం ఇది!
హనుమాన్ విజయోత్సవం
సీతాన్వేషణ మొదలు రావణ సంహారం అనంతరం అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయినంతవరకూ..ప్రతి అడుగులోనూ హనుమంతుడి సహకారం ఉందని రాముడు గుర్తుచేసుకున్నాడు. శ్రీరామనవమి, శ్రీ రామ పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన పౌర్ణమి రోజు మనస్ఫూర్తిగా ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ రోజే చైత్ర పూర్ణిమ...హనుమాన్ విజయోత్సవం
హనుమాన్ జయంతి
వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||
వైశాఖ మాస బహుళ దశమి రోజు హనుమంతుడు జన్మదినం.. ఈరోజు హనుమాన్ జయంతి.
శ్రీ హనుమద్ర్వతం
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||
ఆంజనేయుడి అనుగ్రహం పొందేందుకు మరో దివ్యమైన మార్గం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమంతుడిని పూజించడం. ఈ రోజునే హనుమద్ర్వతం అంటారు.
Also Read: ఆంజనేయుడికి మంగళవారం, శనివారం ఎందుకు ప్రత్యేకం - హనుమాన్ జయమంత్రం విశిష్టత తెలుసా!
హనుమద్ర్వతం విశిష్టత
సూర్యుడు తన విద్యను పుత్రిక సువర్చలా రూపంలో హనుమంతుడికి ధారపోసిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. ఇదంతా పంపానది తీరంలో జరిగిందని పురాణాల్లో ఉంది. అందుకే ఈ రోజు పంపానది జలాన్ని కలశంలోకి తీసుకుని కానీ..మీ కలశంలో ఉన్న జలంలోకి పంపానదిని ఆవాహనం చేసి హనుమాన్ ని పూజిస్తారు. పూజలో భాగంగా 13 ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఇలా 13 సంవత్సరాల పాటూ వరుసగా హనుమద్ర్వతం ఆచరిస్తే మీకు అసాధ్యం కానిది ఉండదని పండితులు చెబుతారు.
కలశంలోకి పంపానదిని ఆవాహనం చేసే విధానం
పీఠంపై హనుమాన్ పటం పెట్టి పూలమాలలు, సింధూరంతో అలంకరించి ఎదురుగా రాగి, వెండి, కంచు పాత్రలో పంపానది నీటిని ఉంచాలి.
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర్చలా సామెత హనుమద్వ్రత పూజాంగత్వేన పంపాపూజాం కరిష్యే అని ఆ నీటిని ముట్టుకోవాలి. ముందుగా పంపాకలశ ప్రతిష్టాపన చేసి షోడసోపచారాలతో పూజించాలి.
శ్రీకృష్ణుడు ద్రౌపదితో చేయించిన వ్రతం
శ్రీ హనుమద్ వ్రతం దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు కలగజేస్తుంది, రాజ్యలక్ష్మి వరించేలా చేస్తుందని ఉపదేశించిన శ్రీ కృష్ణుడు .. ద్రౌపదితో ఈ వ్రతాన్ని దగ్గరుండి చేయించాడని..ఆ ఫలితంగానే పాండవులకు తిరిగి సిరిసంపదలు లభించాయని శౌనకాది మహర్షులు సూత మహర్షిని వివరించారు.
Also Read: ఎక్కడ తగ్గాలో శనికి తెలియజేసిన హనుమాన్ - ఇద్దరి మధ్యా ఏం జరిగింది!
శ్రీరాముడు ఆచరించిన హనుమద్ర్వతం
పూర్వం శ్రీ రాముడు సీతను వెతుకుతూ రుష్యమూక పర్వతం చేరుకుని సుగ్రీవ, హనుమలతో స్నేహం చేశాడు. అప్పుడు హనుమంతుడు తన వృత్తాంతం చెప్పి దేవతలంతా తనకు వరాలు ప్రదానం చేశారో వివరించాడు. అప్పుడు బ్రహ్మాదిదేవతలంతా.. హనుమా .. సూర్యుడు విద్యను ధారపోసిన రోజైన మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు నిన్ను ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజించి..హనుమద్ర్వతం ఆచరిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని సెలవిచారు. ఆ తర్వాత శ్రీరాముడు ఈ వ్రతం ఆచరించి 13 తోరాలున్న దారాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రావణుడిని సంహరించి విజయం పొందాడని వ్యాసమహర్షి ధర్మరాజుకి వివరించారు.