Impotance Of Conch:'శంఖం' సంపదకు ప్రతీకగా ఎందుకు చెబుతారు, దీన్ని ఎలా పూజించాలి!
శంఖం రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి, ఖం అంటే జలం. క్షీరసాగర మధన సమయంలో దేవతలకు వచ్చిన సంపదలలో శంఖం ఒకటని చెబుతాయి పురాణాలు. అందుకే శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
Impotance Of Conch: అఖండ అదృష్టం,ఐశ్వర్యం,అభివృద్ధి,కీర్తిప్రతిష్టలు అనుగ్రహించే అఖండ దైవిక వస్తువుగా శంఖాలను భావిస్తారు.
శంఖే చంద్ర మావాహయామి!
కుక్షే వరుణ మావాహయామి!
మూలే పృధ్వీ మావాహయామి!
ధారాయాం సర్వతీర్థ మావాహయామి!
సంపదకు ప్రతీక అయిన శంఖాన్ని పూజాగదిలో ఉంచితే సకల అరిష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వాటిలో శంఖం కూడా ఒకటి. దానినే పాంచజన్యం అంటారు. శ్రీమహావిష్ణువు ధరించడం వల్లే శంఖానికి పవిత్రత చేకూరింది కొన్ని ఆలయాల్లో తలుపులు తీసేటప్పుడు, పూజ పూర్తైన తర్వాత శంఖాన్ని ఊదుతారు. ఇంట్లో దేవుడి గదిలో శంఖం పెట్టి నిత్యం పూజిస్తే శుభం జరుగుతుందని హిందువుల విశ్వాసం.
Also Read: లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!
శంఖంలో రెండు రకాలున్నాయి
1.దక్షిణావృత శంఖం
దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజా విధానంలో వినియోగించరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది.
ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయంటారు
2. వామావృత శంఖం
ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. పూజా విధానాల్లో తరచుగా వాడేది ఇదే. వామావృత శంఖం ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు రావంటారు పండితులు.
వైదిక శాస్త్రం ఏం చెబుతోంది
వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు రావని, ఆస్మా కూడా తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాధులు దూరమవుతాయట.
శంఖాల పేర్లు
లక్ష్మీ శంఖం, గోముఖ శంఖం, కామధేను శంఖం, దేవ శంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖం,
Also Read: ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!
శంఖాలలో ప్రత్యేకమైనది గోముఖ శంఖం
విభిన్న శంఖాలలో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం ఇది. హిమాలయాలలోని కైలాస మానస సరోవరంలోను, శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవులలోను ఇవి లభ్యమవుతాయి. శివలింగాన్ని గాని, శివపార్వతులను గాని పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేస్తే విశేషమైన ఫలితం అందుకుంటారు. గోముఖ శంఖం తెలుపు, పసుపుల మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. ఈ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ధ తరంగాలు మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. గోముఖ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజుగాని గురువారం రోజు గాని ప్రతిష్టించి పూజించాలి. గోముఖ శంఖంలో గంగాజలాన్ని, ఆవు పాలను నింపి ఇంట్లో, వ్యాపార స్థలంలో చల్లితే నరదృష్టి ప్రభావం ఉండదని, ధనం వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.
పవిత్రకు చిహ్నం
శంఖం జలాన్ని ఉంచే మంచి కలశంగా భావిస్తారు. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్ధంగా ఉపయోగిస్తారు. శంఖంలో పోస్తేగానీ తీర్ధం కాదు అనే నానుడి ఇలా వచ్చినదే. నవ నిధులు, అష్టసిద్ధులలో దీనిని ఉపయోగిస్తారు. ఫూజా, ఆరాధన, యఙ్ఞాలు, తాంత్రిక క్రియలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని పూజించడంతో పాటు శంఖంతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అభిషేకం చేస్తారు.