Shani Dev: ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!
హిందూ సంప్రదాయంలో భాగంగా కొన్ని పద్దతులు పాటిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని వస్తువులు ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోకూడదని, అలా తీసుకోవడం వల్ల దోషం కలుగుతుందని విశ్వసిస్తారు. ఆ వస్తువులేంటో చూద్దాం...
Shani Dev: దానం అనేది మానవత్వానికి ప్రతీక. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం మనిషి కనీస ధర్మం. అయితే కొన్ని దానాలకు దోషాలను పోగొట్టే శక్తి ఉంటుందంటారు పండితులు. అవికూడా శాస్త్రోక్తంగా పురోహితుల మంత్రోచ్ఛారణ సమయంలో చేసే దానాల ద్వారా తమ దోషాల నుంచి ఉపశమనం పొందుతారు. పండితుల సమక్షంలో సరేకానీ..ఈ నాలుగు వస్తువులు మాత్రం ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు, ఎవ్వరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదు. అవేంటో చూద్దాం..
ఉప్పు (salt)
ఉప్పు గురించి హిందూ ధర్మం లో చాలా వివరణే ఉంది. దశదానాల్లో ఉప్పు ఒకటి. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా విశ్వసిస్తారు. ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునేవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి లక్ష్మిదేవి ఉద్భవించింది. అదే సముద్రగర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలని చెబుతారు. జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు కాబట్టి..ఉప్పును ఎవరి చేతినుంచైనా అందుకుంటే వారి చెడుని మీరు అందుకుంటున్నట్టే అని చెబుతారు పండితులు
Also Read: ఈ రాశులవారు ఓడిపోతే చాలా చాలా హర్టవుతారు
నువ్వులు ( Sesame seeds)
నల్ల నువ్వులను కూడా శని దోషాలు తొలగించుకునేందుకు దానంగా వినియోగిస్తారు. అందుకే ఎప్పుడూ నల్ల నువ్వులు ఉచితంగా తీసుకోవడం కానీ, ఒకరి చేతినుంచి మరొకరు అందుకోవడం కానీ చేయకూడదు. నల్ల నువ్వులు ఉచితంగా తీసుకోవడం అంటే వారిలో ఉన్న శనిని మీలోకి ఆహ్వానించినట్టే. నువ్వులను పితృకార్యాల్లో వినియోగించడం వల్ల కూడా ఉచితంగా తీసుకోరాదని చెబుతారు.
ఇనుము (iron)
ఇనుమును లేదా ఇనుము తో తయారు వస్తువులను కూడా దానం గా తీసుకోకూదంటారు పండితులు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా.. దానికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి. ఎందుకంటే ఇనుము కూడా శనికి చిహ్నంగా చెబుతారు. అందుకే శనివారం పూట ఇనుమును తెచ్చుకోకూడదని అంటారు.
నూనె (oil)
నూనె సంగతి మీకు తెలిసినదే..నిత్యం వింటున్నదే. నూనెను ఎవ్వరి చేతికీ ఇవ్వకూడదు. ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంతడబ్బు చెల్లించి నూనె తీసుకోవాలి కానీ ఉచితంగా తీసుకుంటే వారింట శని మీ ఇంట్లో అడుగుపెడుతుందని విశ్వసిస్తారు.
Also Read: మే 25 నుంచి రోహిణి కార్తె, రోళ్లు పగులుతాయని ఎందుకంటారు!
ఇదంతా ప్రచారం మాత్రమేనా!
ఉప్పు, నూనె, నువ్వులు వంటివి చేతికి సరాసరి తీసుకోవడం వల్ల కొంత అసౌకర్యం ఉంటుందని అలా చెప్పారు కానీ ఎలాంటి దోషం ఉండదంటారు మరికొందరు పండితులు. ఉప్పుకారాలు అంటిన చేయి కంటికి తగిలితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక నూనె జిడ్డు పదార్థం. జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ దృష్టితో ఈ వస్తువులను నేరుగా చేతికి అందుకోరాదంటారు కానీ ఏదో జరిగిపోతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.