Makar Sankranti 2025: లోహ్రి, ఖిచ్డీ, మాఘి, సంక్రాంతి..పేరేదైనా పండుగ సందడి ఒకటే.. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారంటే!
హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. మకర సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.. ఒక్కో సంప్రదాయాన్ని అనుసరిస్తారు..
Sankranti Celebrations in Different States: సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయమే మకర సంక్రమణం..ఇదే సంక్రాంతిగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ..ఇలా మూడు రోజులు జరుపుకునే పండుగ కోసం దాదాపు నెల రోజుల ముందునుంచీ ప్లాన్ చేసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా ఈ మూడు రోజుల కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. అయితే సంక్రాంతి పండుగను వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారు..మనం సంక్రాంతి అని పిలిచినట్టే వాళ్లేమంటారు?
ఉత్తరాయణ పండుగ
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పండుగ/ గాలిపటాల పండుగగా పిలుస్తారు. చిన్న పెద్దా అంతా గాలిపటాలు ఎగురవేసి సంబరాలు చేసుకుంటారు.
లోహ్రీ
పంజాబ్,చండీఘర్, హర్యానా రాష్ట్రాల్లో సంక్రాంతిని మాఘీ పేరుతో జరుపుకుంటారు. తెలుగువారు భోగి అని పిలిచే రోజుని అక్కడ లోహ్రి అంటారు.
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!
ఖిచ్డీ
రామ జన్మభూమి అయోధ్యలో సంక్రాంతి వేడుకలను ఖిచిడీ అంటారు. ఈ రోజు పప్పు, బియ్యంతో ఖిచిడీని తయారు చేసి నివేదిస్తారు. వేరుశనగలు, బెల్లంతో వంటకాలు, నువ్వులతో లడ్డూ తయారు చేస్తారు.
పొంగల్..
తమిళనాడులోనూ సంక్రాంతిని పొంగల్ పేరుతో జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులో మొదటి రోజును భోగి పొంగల్, రెండో రోజును సూర్య పొంగల్, మూడో రోజును మట్టు పొంగల్, నాలుగో రోజును కన్యా పొంగల్ అంటారు. అన్నం, పాలు, బెల్లం, నువ్వులతో తయారు చేసిన వంటకాలు నివేదిస్తారు
గంగాసాగర్ మేళా
పశ్చిమ బెంగాల్ లో సంక్రాంతిని పౌష్ పర్బోన్ లేదా గంగాసాగర్ మేళా అని పిలుస్తారు. దేశవాప్తంగా భక్తులు ఈ రోజు గంగా నది - బంగాళాఖాతం సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరిస్తారు. అనంతరం కపిలముని ఆశ్రమంలో పూజలు చేస్తారు. బెంగాల్‌లో సాధారణంగా ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. బియ్యం, కొబ్బరి, పాలు ఖర్జూర మిశ్రమంతో తయారుచేసిన సంప్రదాయ మిఠాయిలు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని "పులి పిత" అని పిలుస్తారు.
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!
ఆంధ్రప్రదేశ్
ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. భోగి, సంక్రాంతి,కనుమ మూడు రోజుల పాటూ ఊరూవాడా సంబరమే. కోడి పందాలు, ఎడ్ల పందాలు పోటాపోటీగా జరుగుతాయి. భోగి మంటలు, గొబ్బిళ్లు, పిల్లకు భోగిపళ్లు పోయడం, హరిదాసులు, బసవన్నల సందడి, ఆటపాటలు..ఏడాది మొత్తం గుర్తుండిపోయేంత సందడి మొత్తం ఈ మూడు రోజులు ఉంటుంది. అందుకే చదువు, ఉద్యోగం పేరుతో ఎక్కడున్నా ఈ మూడురోజులు స్వగ్రామాలకు వెళ్లిపోతారంతా.
తెలంగాణ
తెలంగాణలో సంక్రాంతి అంటే పతంగుల పండుగ. రంగు రంగు గాలిపటాలు ఆకాశానికి కొత్త రంగులు అద్దుతాయ్.
ఇంకా వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతిని విభిన్నంగా జరుపుకుంటారు.ఏ పేరుతో పండుగ చేసుకున్నా కొత్త బియ్యం, బెల్లం, నువ్వులు, కొబ్బరితో వంటకాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇరుగు పొరుగు పంచుకుంటారు.
Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!