Guru Purnima 2024: పురాణాల్లో ఉపాధ్యాయ దినోత్సవం..గురుపౌర్ణమి ( జూలై 21) విశిష్టత ఇదే!
Guru Purnima 2024 : సప్త చిరంజీవుల్లో ఒకరు వ్యాసమహర్షి. వేదాలను విభజించి వేదవ్యాసుడైన ఆయన పుట్టుకే ప్రత్యేకం. వ్యాసుడు ఆది గురువు ఎలా అయ్యారు? ఆయన జన్మతిథిని గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటారంటే..
Guru Purnima 2024 : జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి. వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన వేద వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయుడు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించారు. భూమ్మీద ఇప్పటికీ బతికి ఉన్నారని చెప్పే సప్తచిరంజీవులలో వ్యాసమహర్షి ఒకరు. ఆయన పుట్టుక గురించి మహాభారతం ఆదిపర్వంలో ఉంది.
సప్త చిరంజీవులు ఎవరో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
చేపకు జన్మించిన మత్స్యగంధి
చేది రాజ్యాన్ని పాలించే వసువు అనే మహారాజు ఓ రోజు వేటకు వెళ్లాడు. అక్కడ మునులను చూసి తపస్సు చేయడం ప్రారంభించాడు. దిగొచ్చిన దేవేంద్రుడు నీ పరిపాలనకు, తపస్సుకి ముగ్దుడనయ్యాను, నా వద్దకు వచ్చిపోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అని చెప్పాడు. ఆ సమయంలో దివ్యత్వాన్ని, దివ్య విమానాన్ని, వాడిపోని పద్మమాలను , దుష్టశిక్షణ చేసేందుకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. వసువు నివసించే నగరానికి పక్కనే శక్తిమతి అనే నది ఉంది. ఆ పక్కనే పర్వతరూపంలో ఉండే కోలహలుడు..శక్తిమతిపై మోజుపడి ఆ నదిని అడ్డగించడంతో.. వసువు పర్వతానికి గర్వభంగం చేసి శక్తిమతికి అడ్డుతొలగించాడు. అప్పటికే శక్తిమతికి కోలహలుడి వల్ల గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శక్తిమతి కుమార్తె గిరికను వివాహం చేసుకుని... ఆమె సోదరుడైన వసుపదుడుని సైన్యాధిపతిగా నియమించుకుంటాడు వసువు. ఓ రోజు వేటకు వెళ్లిన వసువు...భార్యపై విరహవేదనలో ఉన్నప్పుడు వచ్చిన రేతస్సును ఓ దొన్నెలో చేర్చి డేగకి ఇచ్చి తన భార్యకివ్వమని పంపిస్తాడు. కానీ మార్గమధ్యలో ఆ రేతస్సు యమునానదిలో పడి అద్రిక అనే చేప మింగి గర్భం దాల్చుతుంది. బ్రహ్మదేవుడి శాపంతో చేపగా మారిన అద్రిక.. చేపలుపట్టేవారికి దొరుకుతుంది. దానిని కోసి చూడగా అందులోంచి ఓ కుమార్తె , కుమారుడు బయటకొస్తారు. అద్రికకు శాపవిమోచనం జరిగి తన లోకానికి వెళ్లిపోతుంది. ఆ మత్స్యకారులు పిల్లలను తీసుకొచ్చి దాశరాజుకి అప్పగిస్తారు. మత్స్య గర్భాన జన్మించిన ఆ బిడ్డకు మత్స్యగంధి అని పేరు పెట్టి పెంచాడు దాశరాజు.
Also Read: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!
వ్యాస మహర్షి జననం
తండ్రి లేనప్పుడు యమునానదిపై పడవనడుపుతూ ఉండేది మత్స్యగంధి..ఈమెకు మరో పేరు సత్యవతి. ఓ రోజు.. వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా పర్యటన చేస్తూ యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి భోజనానికి కూర్చోవడంతో ఆ బాధ్యత కుమార్తెకు అప్పగించాడు. అప్పుడు మత్స్యగంధి పరాశర మహర్షిని పడలో ఎక్కించుకుని ఒడ్డుకి తీసుకెళుతుండగా..ఆమెని చూసి పరాశమ మహర్షి మనసు చలించింది..ఆ వెంటనే తన మనసులో మాట బయటపెట్టాడు. ఆసమయంలో ఇద్దరి మధ్యా జరిగిన చర్చ ఇది.
మత్స్య గంధి: మహానుభావులైన మీకు పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని తెలియదా?
పరాశర మహర్షి: అప్పటికప్పుడు మాయా తిమిరం ( పడవచుట్టూ చీకటిని) సృష్టించాడు
మత్స్య గంధి: కన్యత్వం కోల్పోయిన తర్వాత నా తండ్రి ముందు ఎలా నిలబడగలను
పరాశర మహర్షి: కన్యత్వం చెడిపోదని మాటిచ్చి..వరం కోరుకోమన్నాడు
మత్స్య గంధి: నా శరీరం నుంచి వచ్చే చేపల కంపు నుంచి విముక్తి కల్పించండి
పరాశర మహర్షి: ఆ క్షణం పరాశరమహర్షి ఇచ్చిన వరంతో మత్స్యగంధి యోజనగంధిగా మారింది. అంటే ఆ శరీరం నుంచి చేపల కంపు మాయమై వచ్చే గంధం పరిమళం యోజనదూరం వరకూ వ్యాప్తి చెందుతుంది
Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం!
ఆ సమయంలో పరాశర మహర్షికి - యోజన గంధికి జన్మించిన పుత్రుడే వ్యాసమహర్షి...ఆ రోజే ఆషాఢ పౌర్ణమి
సూర్యుడితో సమానమైన తేజస్సుతో, సకల వేద జ్ఞానంతో జన్మించిన వేద వ్యాసుడు పుట్టిన వెంటనే తపస్సు చేసుకునేందుకు బయలుదేరాడు. అమ్మా నువ్వు ఎప్పుడు స్మరిస్తే ఆ క్షణం నీ కళ్లముందుకి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి.. భారతం అడుగడుగునా కనిపిస్తాడు. అంతెందుకు..అసలు భరత వంశాన్ని నిలిపింది వ్యాసుడే.
మహాభారతం ప్రతి మలుపులోనూ వ్యాసమహర్షి
తనయుడైన వ్యాసుడు తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయిన తర్వాత యోజనగంధి తిరిగి తండ్రి దగ్గరకు చేరుకుంటుంది. ఓసారి వేటకు వచ్చిన శంతనమహారాజు...సత్యవతిని చూసి వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పటికే శంతనుడికి - గంగకు వివాహం భీష్ముడు జన్మించడం జరిగిపోతుంది. అయితే తన కుమార్తెకు జన్మించిన బిడ్డలే రాజ్యమేలానని దాశరాజు కోరడంతో... అందుకు తాను అడ్డురాను అని చెప్పి భీష్ముడు ప్రతిజ్ఞ ( అదే భీష్మ ప్రతిజ్ఞ) చేస్తాడు. అలా సత్యవతి శంతనుడి వివాహం జరుగుతుంది. వారికి జన్మించిన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందడంతో భరత వంశాన్ని నిలబెట్టమని తన కుమారుడిని స్మరిస్తుంది యోజనగంధి. అలా... వ్యాసమహర్షి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడు జన్మిస్తారు. వ్యాసుడు తిరిగి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రతి మలుపుతో సహా కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతి మలుపులోనూ వ్యాసమహర్షి కనిపిస్తాడు.
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!
మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి అందించారు. అందుకే వ్యాసుడిని ఆది గురువుగా భావించి ఆయన జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పురాణాల్లో టీచర్స్ డే. వేద విద్యను అభ్యసించే విద్యార్థులు తమ గురువులను సన్మానించి..ఆశీస్సులు తీసుకునే రోజు ఇది.