Chaturmasya Pooja 2024: శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి.. చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి - ఈ దీక్ష ఎన్ని రకాలు!
Chaturmasya Pooja : ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకూ 4 నెలల పాటూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.ఈ సమయంలో ఏం చేయాలి - ఏం చేయకూడదు? అసలు విష్ణువు నిద్రపోవడం ఏంటి?
Chaturmasya Pooja 2024
ఆషాఢ శుద్ధ ఏకాదశి - శయన ఏకాదశి ( శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లేరోజు)
కార్తీక శుద్ధ ఏకాదశి - ఉత్థాన ఏకాదశి ( మహావిష్ణువు యోగనిద్రలోంచి లేచి గరుడవాహనంపై ఆసీనుడై అందరకీ దర్శనమిచ్చే రోజు)
ఈ మధ్యలో వచ్చే భాద్రపద ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు - విష్ణువు నిద్రలోంచి పక్కకు తిరిగే సమయం..
శ్రావణవాసంలో వచ్చేది పుత్రద ఏకాదశి అంటారు. ఈ నాలుగు నెలల దీక్షనే చాతుర్మాస్య దీక్ష అంటారు..
శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి?
విష్ణువు అంటే ఓ మనిషి కాదు..విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి. విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణు అనే శ్లోకం ఉంటుంది... అలాంటి మొత్తం శక్తి తనలో తాను అంతర్ముఖం అయ్యే సమయం ఇది. ఈ సమయంలో దీక్ష పేరుతో ఎవరైనా కానీ తమలో తాము అంతర్ముఖులు కావాలన్నేదే చాతుర్మాస్య దీక్ష ఉద్దేశం. సూర్య భగవానుడు విష్ణువు ప్రధమాంశ అని పురాణాల్లో ఉంది. అలాంటి సూర్య భగవానుడు ఈ నాలుగు నెలలు మోఘాల వెనక్కు వెళ్లిపోతాడు...భౌతికంగా చెప్పాలంటే అదే యోగనిద్ర. ఈ నాలుగు నెలలు అయ్యాక సూర్యుడు ప్రచండంగా బయటకు వస్తాడు అదే విష్ణువు నిద్రలేవడం.
Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం!
చాతుర్మాస్య దీక్ష వల్ల ఏం లాభం?
చాతుర్మాస్య దీక్షను ఏ వయసు వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చేసుకోవచ్చు. భగవంతుడి అనుగ్రహం కావాలి అనుకుంటే దీక్ష చేపట్టవచ్చు. నిత్యం చేసే వ్రతాలు, పూజలు ధర్మార్థకామమోక్షాలు ఇస్తే...చాతుర్మాస్య వ్రతం వైకుంఠ ప్రాప్తిని ఇస్తుంది. వానాకాలంలో సూర్యకాంతి తగ్గి రోగాలు పెరుగుతాయి..అందుకే ఆరోగ్యానికి అనుగుణంగా చాతుర్మాస్య నియమాలు పెట్టారు.
చాతుర్మాస్య దీక్ష ఎలా చేయాలి?
ఈ దీక్ష ఐదు రకాలు
1. చాతుర్మాస్యం - నాలుగు నెలలు పాటించాలి
2. అర్థ చాతుర్మాస్యం - రెండు నెలలు పాటించాలి
3. పాద చాతుర్మాస్యం - ఓ నెల పాటించాలు
4. 9 ఏకాదశులు - 9 రోజులు (శుక్లపక్షంలో వచ్చే 5 ఏకాదశులు - కృష్ణ పక్షంలో 4 ఏకాదశులు)
5. 5 ఏకాదశులు - 5 రోజులు (శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు)
Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!
చాతుర్మాస్య వ్రతాన్ని చేసేవారు పాటించాల్సిన నియమాలు
తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి..శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి
రోజంతా ఏ పని చేస్తున్నా శ్రీ మహావిష్ణును ధ్యానించాలి
ఈ వ్రతం చేసినన్ని రోజులు ఇష్టమైన వస్తువులను వదిలేయండి
మౌన వ్రతం చేయాలి..అంటే అవసరం అయినవి మాత్రమే మాట్లాడాలి, అశుభం మాట్లాడకండి
ఏకాదశి రోజుల్లో ఉపవాస నియమాలు పాటించాలి
చాతుర్మాస్యంలో గోశాలలో సేవచేస్తే అశ్వమేథ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది
చాతుర్మాస్య వ్రతాన్ని చేసేవారు చేయకూడని పనులు
మద్యం, మాంసం ముట్టుకోకూడదు
బ్రహ్మచర్యం పాటించాలి - నేలపైనే నిద్రించాలి
రోజుకి ఒకపూట మాత్రమే తినాలి
ఏది తన్నా శ్రీ మహావిష్ణువుకి నివేదించాలి
దూరప్రాంత ప్రయాణాలు చేయకూడదు
హింస చేయకూడదు, అసత్యం చెప్పకూడదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.