Diwali 2022: దీపాలతో లక్ష్మీదేవికి పలికే ఆహ్వానమే దీపావళి, ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు!
Diwali 2022: దీపావళి రోజు లోగిళ్లన్నీ దీపకాంతులతో మెరిసిపోతాయి. అసలు దీపావళి రోజు దీపాలు ఎందుకు పెట్టాలి. వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటి. తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లేంటి...
“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
'మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను'. అని దీపం వెలిగించి నమస్కరిస్తాం. భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకతే వేరు. దేవాలయం అయినా, ఇళ్లలో అయినా పూజ దీపంతోపే ప్రారంభిస్తాం. ఇంట్లో ఎలాంటి శుభాకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ.
Also Read: ఈ నెల 25న సూర్యగ్రహణం, దీపావళి 24 లేదా 25 ఎప్పుడు జరుపుకోవాలి!
దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుతీరుతాయి. అసలు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. 'అజ్ఙానం'అనే చీకటిని తొలగించి 'జ్ఙానం'అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. 'దీపం' అంటే త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని 'ఎర్రని' కాంతి బ్రహ్మదేవునికి, 'నీలి' కాంతి శ్రీమహావిష్ణువుకి, 'తెల్లని' కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటి మయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే.. మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుకున్న ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని.. అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు.
Also Read: అక్టోబరు, నవంబరులో రెండు గ్రహణాలు - ఈ రాశులవారు చూడకూడదు!
దీపం వెలిగించేటప్పడు చేయకూడని పొరపాట్లు
దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే..అంటూ దీపాల్ని వెలిగించాలి.
- దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం. అడుగుభాగంలో బ్రహ్మ దేవుడు,మధ్యలో శ్రీ మహావిష్ణువు, ప్రమిదలో పరమ శివుడు, ఆ దీపం వెలుగులో సరస్వతి, నిప్పుకణికలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రమిదకు గంధం,కుంకుమ బొట్టు, పూలు పెట్టి నమస్కరించి అక్షతలు వేసి పూజిస్తారు.
- దీపారాధన చేయటానికి వెండి, ఇత్తడి ప్రమిదలకు కన్నా మట్టి ప్రమిదలే మంచిది. ఎందుకంటే లోహం వెడక్కడంతో భూమి వేడెక్కుతుంది... మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లల్లో పూజకు కూడా వెండి,ఇత్తడి ప్రమిదలు వాడొచ్చు కానీ స్టీలు కుందులు వాడరాదు.
- దీపంలో అందం కోసం అంటూ ఎన్ని వత్తులంటే అన్ని వేయరాదు. మూడు వత్తులైనా, రెండు వత్తులైనా కలపి దీపం వెలిగించాలి.
- దీపం అనగానే నూనెతో వెలిగిస్తుంటారు. కానీ నువ్వుల నూనె, ఆవునెయ్యిని వినియోగించడం చాలా మంచిది. ఒకవేళ ఆ రెండూ ఎక్కువగా లేనప్పుడు అందుబాటులో ఉన్న నూనెతో దీపం వెలిగించి అందులో రెండు చుక్కలు నెయ్యి వేసినా పర్వాలేదు
- దీపం ఐశ్వర్యాన్నిస్తుంది. త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపావళి రోజు దీపారాధన చేసిన తర్వాత అన్నీ తిరిగి పొందాడని పురాణోక్తి. అందుకే దీపావళిరోజు దీపాలు పెట్టిన ఇంట లక్ష్మీదేవి కొవులుతీరుతుందని విశ్వసిస్తారు.