చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి జరుపుకున్నారని మరో కథనం
వాస్తవానికి దీపావళి ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియతో ముగుస్తాయి
1.ధన త్రయోదశి ( Dhanteras 2022) ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.
క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.
2.నరక చతుర్దశి (Naraka Chathurdasi) ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈ రోజు నువ్వుల నూనె పట్టించుకుని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు. నరకాసుర వధ జరిగిన ఈ రోజునుంచే క్రాకర్స్ కాల్చడం మొదలుపెడతారు.
3.దీపావళి అమావాస్య (Diwali 2022) ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీపూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు.
4.బలి పాడ్యమి (Balipratipada 2022) దీపావళి మర్నాడు అంటే కార్తీకమాసం మొదటి రోజుని బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు విష్ణుమూర్తి పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు.
మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు.
5. యమ విదియ (Yama Dwitiya 2021) దీపావళి నుంచి రెండోరోజు, కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే విదియను యమవిదియ అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురాణాల్లో మరో రాఖీపండుగ అన్నమాట. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు.
ఈ రోజున సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు సోదరీమణులు. సోదరి చేతి భోజనం తిన్న సోదరుడికి ఆయురారోగ్య ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు.