Dhanteras 2025: ధనత్రయోదశి నాడు ఏయే వస్తువులు కొనడం శుభప్రదం, పూర్తి జాబితా ఇదిగో!
Dhanteras 2025: ధన త్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కొన్ని ప్రత్యేక వస్తువులు కొంటే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతారు..ఆ వస్తువుల జాబితా ఇదే...

Dhanteras Special 2025: ధన త్రయోదశి రోజు కొన్ని ప్రత్యేక వస్తువులు కొనుగోలుకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున కొనుగోలు చేసే వస్తువులు ఇంటికి ఆనందాన్ని తీసుకొస్తాయని, అదృష్టాన్నిస్తాయని నమ్మకం.
2025 సంవత్సరంలో ధన త్రయోదశి అక్టోబరు 18 శనివారం వచ్చింది. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రోజు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజు క్షీరసాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరికి పసుపు రంగు లోహం అంటే ప్రీతికరం. అందుకే ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తారు.
ధన త్రయోదశి రోజు ఏం కొనడం శుభప్రదం
బంగారం
ధన త్రయోదశి రోజు బంగారం కొనడం అత్యంత శుభప్రదం. బంగారం సంపద, శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.ఈ రోజు ఒక చిన్న బంగారు నాణెం, ఆభరణం లేదా బంగారు వస్తువు కొనడం ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుందని నమ్ముతారు. వెండి కొనుగోలు కూడా ఈరోజు మంచిది. వెండి నాణెం, పాత్ర లేదా లక్ష్మీ-గణేశ విగ్రహాలు కొనడం సంప్రదాయంలో భాగం.
కొత్త పాత్రలు
కొత్త పాత్రలు కొనడం శుభకరం. ఇంట్లో వినియోగించే వంటసామాను, లోహపు పాత్రలు లేదా గిన్నెలు కొనడం ద్వారా సంపద, ఆరోగ్యం పెరుగుతాయని చెబుతారు. ముఖ్యంగా రాగి, ఇత్తడి, లేదా వెండి పాత్రలు ప్రాధాన్యతనిస్తారు.
గృహోపకరణాలు
ధన త్రయోదశి రోజు గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం కూడా సమృద్ధిని తెస్తుంది. టీవీ, ఫ్రిజ్, లేదా ఇతర గృహ వస్తువులు కొనడం ద్వారా ఆధునిక సౌకర్యాలతో పాటు శుభం కలుగుతుందని నమ్మకం.
దేవుడి ఫొటోలు, విగ్రహాలు
ధన త్రయోదశి రోజు లక్ష్మీ-గణేశ విగ్రహాలు లేదా పూజా సామాగ్రి కొనడం ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ వస్తువులు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తాయి. ముఖ్యంగా ధన్వంతరి విగ్రహం ఈ రోజు కొనుగోలు చేసి ఇంట్లో నిత్యం పూజిస్తే ఆ ఇంట్లో ఉన్నవారంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. లక్ష్మీదేవి పాదాలు కొనుగోలు చేసి తీసుకొస్తారు
వాహనాలు, ఆస్తుల కొనుగోలు
వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు. ఇది దీర్ఘకాలిక సంపదకు సంకేతం.
ఇంకా..
ధన త్రయోదశి రోజు చీపురు కొనడం శుభప్రదం.
ఉప్పు కొనడం శుభప్రదం.
ధన త్రయోదశి రోజు ఇంటికి 5 తమలపాకులు తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తమలపాకులను లక్ష్మీదేవికి సమర్పిస్తారు.
ధనియాలను శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు..ఈ రోజు ధనియాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తారు
కొనుగోలు చేసే ముందు శుభ ముహూర్తాన్ని చూసుకోండి. ఎందుకంటే ప్రతిరోజూ కొద్ది సమయం వర్జ్యం, దుర్ముహూర్తం ఉంటాయి. ఆ ఘడియలు లేని సమయం లో కొనొచ్చు..లేదంటే.. అమృత ఘడియల్లో కొనుగోలు చేయడం ఇంకా మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















