Dhanteras 2024 : ధన త్రయోదశి రోజు బంగారం కొనాలా - ఈ రోజుకున్న విశిష్టత ఏంటి?
Dhanteras Puja Date and Timings 2024: ఈ ఏడాది త్రయోదశి తిథి రెండు రోజులు రావడంతో ఏ రోజు ధన త్రయోదశి అనే కన్ఫ్యూజన్ ఉంది.. సూర్యోదయానికి త్రయోదశి అక్టోబరు 30న ఉంది.. ఈ రోజే ధన త్రయోదశి...
Significance of Dhanteras: దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని చెబుతారు. ఆమెను ధర్మపత్నిగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడనీ పురాణ గాథ. శ్రీ మహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిధేవతగా ప్రకటించిన రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి. అందుకే ఈ రోజుని ధన త్రయోదశిగా శ్రీ మహాలక్ష్మి జన్మదినోత్సవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు.
Also Read: అక్టోబరు 31 or నవంబరు 01..ఈ ఏడాది దీపావళి ఎప్పుడొచ్చింది - లక్ష్మీపూజ ముహూర్తం ఏంటి!
ధన త్రయోదశి గురించి పురాణాల్లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి..
భూలోకానికి శ్రీ మహాలక్ష్మి కదలి వచ్చిన రోజు
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడులో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి అనుకుంటారు భృగుమహర్షి. వైకుంఠానికి వెళ్లినప్పటికీ మహర్షి రాకను గమనించరు లక్ష్మీనారాయణులు. ఆగ్రహించిన భృగుమహర్షి..స్వామివారి వక్షస్థలంపై కాలితో తంతారు. అయినప్పటికీ ఆగ్రహించని శ్రీ మహావిష్ణువు మహర్షిని శాంతపరిచి సపర్యలు చేసి ఆయన పాదాలు స్పర్శించి అరికాలిలో నేత్రం రూపంలో ఉన్న అహంకారాన్ని చిదిమేస్తాడు. అప్పుడు స్వామివారిని శరణు కోరతారు మహర్షి. అయితే తన నివాసం స్థానంపై మహర్షి కాలితో తన్నడం మహాలక్ష్మి కోపానికి కారణం అవుతుంది. ఆ ఆగ్రహంతో ఆమె భూలోకానికి వెళ్లిపోతుంది. అలా శ్రీ మహాలక్ష్మి భూలోకంలో అడుగుపెట్టిన ప్రదేశమే కొల్లాపూర్. అమ్మవారి వెనుకే వెళ్లిన కుబేరుడు ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రుడై సకల సంపదలు పొందాడు. వైకుంఠం వీడి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చే ఈ రోజే ధన త్రయోదశి అని.. లక్ష్మీ రాకను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.
యమ త్రయోదశి
ధన త్రయోదశిని...యమ త్రయోదశిగా కూడా జరుపుకుంటారు. దీని వెనుక కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఓ రాకుమారుడిని వరించి వివాహానికి సిద్ధమైన ఆమెతో.. ఆ రాకుమారుడు పెళ్లి జరిగిన నాలుగోరోజునే చనిపోతాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. అయినప్పటికీ తననే వరించానని పెళ్లిచేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంటుంది ఆ వధువు. పెళ్లి జరిగిపోతుంది. సరిగ్గా నాలుగో రోజు..ఆ రాకుమారుడి గది బయట బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తుంది.. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకెళ్లేందుకు పాము రూపంలో వచ్చిన యముడు..నగలపై పడిన కాంతి, రాకుమారి పాటలకు మైమరచిపోతాడు. అలా మృత్యు ఘడియలు దాటిపోవడంతో వెనుతిరగాల్సి వచ్చిందని మరో కథనం. అందుకే ధన త్రయోదశి రోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి అయినా , ఇంట్లో ఉండే ఆభరణాలతో అయినా రాశులుగా పోసి... దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ధన్వంతరి త్రయోదశి
వైద్యులకు ఆద్యుడైన ధన్వంతరి జయంతి కూడా ధన త్రయోదశి రోజే. వైద్య వృత్తిలో ఉండేవారు ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.
త్రివిక్రమ త్రయోదశి
శ్రీ మహావిష్ణువు వామన అవతారం ధరించి బలిని పాతాళానికి తొక్కేసిన రోజు ఈ రోజే అని..అందుకే ఈ రోజుని త్రివిక్రమ త్రయోదశి అని కూడా పిలుస్తారు
ఇంకా కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో ధన త్రయోదశిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే పూజలు, దానాలు, జపాలు విశేష ఫలితాలను ఇస్తాయంటారు పండితులు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!