TTD Pink Diamond: బాల్యంలో ధరించిన హారాన్ని శ్రీవారికి సమర్పించిన మైసూరు మహారాజు- వీడిన పింక్ డైమండ్ మిస్టరీ!
Tirumala News: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. అయితే అది పింక్ డైమండ్ కాదు రూబీ అని తేలింది.

Tirumala: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మిస్టరీ వీడింది. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అది అసలు పింక్ డైమండ్ కాదు కెంపు... 1945లో మైసూరు మహారాజు శ్రీవారికి బహూకరించారు
1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారు. ఈ హారంలో ఉన్నది పింక్ డైమండ్ కాదని, కెంపు (రూబీ) అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధ్యయనంలో వెల్లడైంది. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం, ఈ హారంలో కెంపులు, ఇతర రత్నాలు మాత్రమే ఉన్నాయి, పింక్ డైమండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
ఈ సర్వే వెల్లడించిన విషయాలతో పింక్ డైమండ్ కథ కంచికి చేరినట్టైంది. గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం భారీగా చర్చకు తావిచ్చింది. ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యం అని తేల్చి చెప్పేలా కొన్ని ఆధారాలను బయపెట్టారు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం. తిరుమల శ్రీవారికి విలువైన ఆభరణాలు సమర్పించిన రాజుల్లో మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ కూడా ఉన్నారు.
1945 జనవరి 9న తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ పర్యటనకు సంబంధించి మైసూర్ ప్యాలెస్ నుంచి 1944 డిసెంబరు 29న రామయ్య అనే ప్యాలెస్ అధికారి TTD కమిషనర్‌కు లేఖ రాసినట్టు ఆధారాలున్నాయి. రైలు ద్వారా 1945 జనవరి 9న ఉదయం 8 గంటలకు రేణిగుంటకు చేరుకున్న రాజావారు తిరుపతి, శ్రీకాళహస్తి రాకపోకలకు 2 కార్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలంటూ ఆ లేఖలో ఉంది. టూర్ షెడ్యూల్ కాపీని కూడా పంపించారు. ఈ పర్యటనకు వచ్చినప్పుడే మహారాజు శ్రీవారికి హారాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ఆ హారాన్ని విశేష ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా 2001 అక్టోబరు 21న జరిగిన గరుడ సేవలో మలయప్పస్వామికి అలంకరించిన ఆహారం..కెంపు విరిగిపోయింది.
భక్తులు విసిరిన నాణేలు తగిలి ఇలా జరిగిందని ఆ విషయాన్ని తిరువాభరణం రిజిస్టర్ లో నమోదు చేశారు. అయితే మైసూర్ మహారాజు సమర్పించిన హారంలో ఉన్నది కెంపు కాదు పింక్ డైమండ్ అని.. దాన్ని అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారని 2018లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితుల వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయ్. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదంటూ జగన్నాధరావు కమిటీ ఇచ్చిన నివేదికలో పగిలిన కెంపు ముక్కలు పేష్కార్ ఆధీనంలో ఉన్నాయని స్పష్టంగా వివరణ ఇచ్చారు. అయినప్పటికీ స్వామికి కొన్నేళ్లుగా కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు ఈ మాట చెప్పడంతో భక్తులు సందేహంలో పడ్డారు.
శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాల్లో కొన్ని మాయమయ్యాయనే ఆరోపణలు రావడంతో 2009 సెప్టెంబరులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాధరావు నేతృత్వంలో ఓ కమిటీ, 2010లో జస్టిస్ వాద్వా నేతృత్యంలో మరో కమిటీ వేశారు. ఆభరణాలన్నీ సక్రమంగానే ఉన్నాయని తేలింది. జగన్నాథరావు కమిటీ కూడా 1952 నుంచి ఉన్న రికార్డుల ప్రకారం ఆభరణాలన్నీ పదిలంగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. 2001బ్రహోత్సవాల సమయంలో పగిలిన కెంపు స్థానంలో వెంటనే ఓ పగడం తిరిగి అమర్చినట్టు కమిటీ వివరించింది.
మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ లేదనే విషయాన్ని తేల్చి చెప్పారు మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి. మైసూరు మహారాణి ప్రమోద దేవిని కలవడంతో పాటూ ప్యాలెస్ లో రికార్డులు పరిశీలించగా ఈ విషయాలు వెలుగుచూశాయ్. దీంతో గతంలో చేసిన విమర్శలు అవాస్తవాలే అని తేలింది.























