Anantha Padmanabha Swamy Vratham 2024: 'అనంత చతుర్దశి'.. ఈ రోజు అచరించాల్సిన వ్రతం - నియమాల గురించి తెలుసా!
Anantha Padmanabha Swamy Vratham 2024: వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం అనంత పద్మనాభ స్వామి వ్రతం. ఏటా భాద్రపదమాసంలో ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, నిమయమాలేంటో తెలుసుకుందాం..
Anantha Padmanabha Swamy Vratham In Telugu : ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని అనంత చతుర్థి అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఇదే రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత విశిష్టమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు సహా పాండవులు అందరకీ సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు.
మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి క్షేమసమాచారం తెలుసుకునేందుకు శ్రీ కృష్ణుడు వచ్చిపోతుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం.
Also Read: తులా రాశిలోకి విలాసాల అధిపతి.. ఈ రాశులవారి జీవితాల్లో ఇక అంతా సంతోషమే!
అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు.. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు.
ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే సెప్టెంబరు 17నే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించాలి...
Also Read: సెప్టెంబరు 17 నుంచి ఈ రాశులవారి జాతకం మారిపోతుంది!
ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. ఆ సూచన మేరకు అరణ్యవాసంలో ఉన్నన్ని ఏళ్లు పాండవులంతా ఏటా అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చారు. అందుకే అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ ఎక్కడా పరాజయం పాలవలేదు.
Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
అనంత పద్మనాభ వ్రతం ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు
వ్యక్తిగత జీవితంలో ఎదులయ్యే సమస్యలకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది..