Ysrcp MP Lavu : మరో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ దూరం జరుగుతున్నారా ? టీడీపీ ఎంపీలతోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నారు ?
వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు సొంత పార్టీకి దూరం జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా లేరు. అదే సమయంలో టీడీపీ ఎంపీలతో కలిసి కనిపించడం ఆసక్తి రేపుతోంది.
Ysrcp MP Lavu : వైఎస్‌ఆర్‌సీపీ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు సొంత పార్టీకి దూర దూరంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ ఆయన పెద్దగా వారితో కలవడం లేదు. మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశఇనేని నాని ఇంట్లో జరిగిన సమావేశానికి ఆయన వెళ్లారు. టీడీపీ ఎంపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొంత మంది యువ ఎంపీలు ఆ భేటీకి హాజరయ్యారు. సాధారణంగా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తే.. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్నట్లుగా ఉంటుంది. అలాంటిది వైఎస్ఆర్‌సీపీ ఎంపీ టీడీపీ ఎంపీ ఇంటికి విందుకు వెళ్తే చర్చనీయాంశం కాకుండా ఎలా ఉంటుంది ?.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అప్పుడే - కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
విజ్ఞాన్ విద్యా సంస్థల వారసుడు అయిన లావు కృష్ణదేవరాయులు రాజకీయాల్లో తొలి సారిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు. మొదట్లో చురుకుగా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తన నియోజకర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆయన తమ నియోజకవర్గంలో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
ముఖ్యంగా చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఎంపీ పర్యటనను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి విడదల రజనీ వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలకు వచ్చినప్పటికీ ఒకటి రెండు సార్లు ఎంపీ కృష్ణదేవరాయులును విడదల రజనీ వర్గం అడ్డుకుంది. ఈ విషయంలో విడదల రజనీ వైపు హైకమాండ్ ఉండటంతో ఎంపీ సైలెంటయ్యారు.ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. దీంతో ఆయన తాను ఎంపీగా ఉన్నప్పటికీ.. ప్రోటోకాల్ ప్రకారం హాజరవ్వాల్సిన కార్యక్రమాలకూ దూరంగా ఉండాల్సి వస్తోంది. విడుదల రజనీకి మంత్రి పదవి కూడా ఇవ్వడంతో ఆయన మరింత అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు.
లావు కృష్ణదేవరాయులు వ్యవహారంపై వైఎస్ఆర్‌సీపీలోనూ చర్చ జరుగుతోంది. కానీ ఆయన పార్టీని వీడిపోరని.. పార్టీలో చిన్న చిన్న విభేదాలు హజమేనని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు. ఈ విషయంలో ఎంపీ కూడా ఎప్పుడూ తన అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయలేదు. సైలెంట్‌గానే ఉంటున్నారు.