Polavaram CM Jagan : సీఎం జగన్ ఇవ్వలేమంటున్నారు - కేంద్రం మాకు సంబంధం లేదంటోంది ! పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బాధ్యత ఎవరిది ?
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై వివాదం ఏర్పడింది. తాము ఇవ్వలేమని జగన్ నిర్వాసితులకు చెప్పారు. కేంద్రం మాకు సంబంధం లేదంటోంది. ఇంతకూ నిర్వాసితులకు పరిహారం ఎవరివ్వాలి ?
Polavaram CM Jagan : పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి కావాలి. లేకపోతే డ్యాం కట్టినంత మాత్రాన అది ప్రాజెక్ట్ కాదు. ముంపు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించిన తర్వాతనే ప్రాజెక్టులో నీళ్లు నిలపడం సాధ్యమవుతుతుంది. లేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. ప్రాజెక్ట్ అంటే.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా. అది పూర్తయితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. అయితే పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో మొదటి నుంచి వివాదం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాము ఇవ్వలేమని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని నిర్వాసితులకు చెప్పిన సీఎం జగన్!
వెయ్యో..రెండు వేల కోట్లో అయితే తానే ఏదో విధంగా సర్దేవాడినని కానీ ఇరవై వేల కోట్లకుపైగా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని పోలవరం నిర్వాసితులకు పరిహారంపై సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పోలవరం ముంపు నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తూ సీఎం వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వ్యాఖ్యలు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజల్లోనే కాదు సాగునీటి నిపుణుల్లోనూ చర్చకు కారణం అవుతున్నాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేదని నేరుగా సీఎం జగన్ చెప్పినట్లయింది. అయితే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అంటున్నారు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం... ఏ విషయంలోనూ కేంద్రంపై ఒత్తిడి తీసుకు రాలేదు. పోలవరం విషయంలోనూ అంతే. ఇక ముందు ముందు చేస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కేంద్రం ఓ స్పష్టతతో ఉంది. అదేమిటంటే.. ఆ బాధ్యత తమది కాదంటోంది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో సంబంధం లేనట్లుగా కేంద్రం ప్రవర్తన !
పోలవరం జాతీయ ప్రాజెక్ట్. నిబంధనల ప్రకారం జాతీయ ప్రాజెక్టులో 90 శాతం నిధులు కేంద్రం పెట్టుకోవాలి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా చేర్చి వంద శాతం ప్రాజెక్టు ఖర్చును భరించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారం వంద శాతం పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రానిదే అవుతుంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు హయాంలో సవరించిన అంచనాలకు టెక్నికల్ ఆమోదం లభించింది. అయితే ఆ అంచనాలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించకపోగా 2014 ధరల ప్రకారమే పోలవరం ఖర్చు భరిస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అదే సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. దీంతో ఈ అంశంపై పీటముడి పడిపోయింది. ఇప్పుడు పోలవరానికి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కనిపించలేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంచనాలపై జగన్ ఆరోపణలు - నిర్వాసితులకు భారీ హామీైలు !
పోలవరం నిర్మాణ ఖర్చులో అత్యధికం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకతే. పోలవరం వల్ల దాదాపు లక్ష ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఏడు మండలాలను ఏపీలో కలిపింది అందుకే . ప్రభుత్వ భూములు పోను.. ప్రైవేటు భూములు... ప్రజల ఇళ్లు, చెట్లు ఇలా అన్నింటికీ పరిహారం ఇవ్వాలి. ఇందు కోసం దాదాపుగా రూ.. ముఫ్పై వేల కోట్లకుపైగానే ఖర్చవుతుందని అంచనా. ఈ అంచనాల కారణంగా గత ప్రభుత్వం అంచనాలను పెంచి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. చివరి దశ వరకూ అంచనాకు ఆమోదం లభించినప్పుడు ప్రభుత్వం మారింది. అయితే అంచనాలు పెంచినప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతా అవినీతి కోసమేనని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ప్రభావం కనిపించేదమో కానీ అంచనాలను కేంద్రం తగ్గించేసింది. అర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది లక్షలు ఇస్తామన్నారు. దీంతో నిర్వాసితులు ఎక్కువ ఆశలు పెంచుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తంగా వారికి ఎలాంట ిపరిహారం అందని పరిస్థితి.
కేంద్ర, రాష్ట్రాలు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటే నిర్వాసితుల పరిస్థితి ఏమిటి ?
తమకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చేంత స్తోమత లేదని సీఎం జగన్ నేరుగానే చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రూ. వేల కోట్లు ఇస్తుందా అంటే చెప్పడం కష్టమే. గత మూడేళ్ల పరిణామాలను బట్టి చూస్తే ప్రభుత్వం ఒత్తిడి చేయడం కష్టం.., కేంద్రం నిధులివ్వడం అంత కంటే కష్టం అని అనుకోవచ్చు. మరి పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎలా వస్తుంది ?. ఇప్పుడిదే పెద్ద ప్రశ్నగా మారింది.