Visakha Investors Summit: విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ముందే ఏపీకి రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు
Visakhapatnam Investors Summit | ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ భాగస్వామ్య సదస్సు కీలకం కానుంది. దేశ, విదేశాల ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ముందే ₹3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదడం విశేషం.

Visakha Investors Summit | విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ భాగస్వామ్య సదస్సు (Visakha Partnership Summit) అత్యంత కీలకం కానుంది. దేశ, విదేశాల నుంచి ఈ సదస్సుకు ప్రముఖులు హాజరయ్యారు. సదస్సు అధికారికంగా ప్రారంభమయ్యే రోజు కంటే ముందే ₹3.65 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు (MOUలు) కుదిరాయి. మొత్తం రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా ఏపీకి ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సదస్సులో దాదాపు 50కి పైగా దేశాల నుంచి 3000కి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రముఖుల భాగస్వామ్యం
ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తొలి రోజు 25 సెషన్లు సహా మొత్తంగా 45కి పైగా సెషన్లు జరగనున్నాయి. సస్టెయినబిలిటీ, టెక్నాలజీ, ఇండస్ట్రీ, ఇంక్లూజన్ వంటి ఏడు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కీలక సెషన్లలో పాల్గొననున్నారు. అంతేకాకుండా, సీఎం చంద్రబాబు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు, అలాగే ‘AI ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.
కీలక భేటీలు, ఎంఓయూలు
ఈ సదస్సుకు యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు జపాన్ అంబాసిడర్‌తో భేటీ కానున్నారు. ముఖ్యంగా, విజయవాడ–సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసుల ఏర్పాటుకు సంబంధించి ఒక ఎంఓయూ కుదిరింది. మంత్రి నారా లోకేష్ యాక్షన్ టెసా, డిక్సన్, భారత్ బయోటెక్, కిర్లోస్కార్ వంటి అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వివిధ మంత్రులు కూడా పెట్టుబడుల అవకాశాలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు సదస్సు ముగిసిన తర్వాత సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.






















