YSRCP Resigns : రాజీనామాలు చేస్తామని చెప్పలేదు - టీడీపీ వాళ్లే రాజీనామాలు చేయాలన్న గుడివాడ అమర్నాథ్ !
రాజీనామాలు చేస్తామని చెప్పలేదని వైఎస్ఆర్‌సీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. వరుసగా రాజీనామాల ప్రకటనలు చేసిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఒక్క సారిగా ఇలా టర్న్ తీసుకోవడంతో రాజకీయవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
YSRCP Resigns : మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలకు అయినా సిద్ధమని వైఎస్ఆర్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ లేఖ కూడా నాన్ పొలిటికల్ జేఏసీకి ఇవ్వడంతో ఇక రాజీనామాల రాజకీయం ప్రారంభమయిందని అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంత్రి గుడివాడ గురునాథ్.. తాము రాజీనామాలు చేస్తామని చెప్పలేదని అంటున్నారు. రాజీనామా చేస్తామని మంత్రులెవరూ చెప్పలేదని విశాఖలో మీడియాతో మాట్లాడుతూ స్ఫష్టం చేశారు. మా మంత్రులు కూడా ఏం చెప్పారు? ఇక్కడి ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ఎదుగుతున్న ఉద్యమం చూసి, మాకు అందులో భాగస్వామ్యం కావాలని ఉంది. కాబట్టి సీఎం అనుమతి ఇస్తే, అందులో పాల్గొంటామని మంత్రి ధర్మానగారు చెప్పారు. అంతే తప్ప రాజీనామా చేస్తానని ఆయన అనలేదని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానన్న ధర్మాన - లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే ధర్మశ్రీ
విశాఖ రాజధాని కోసం అవసరం అయితే రాజీనామా చేస్తామని మంత్రి ధర్మాన ప్రకటించిన వీడియో ఇప్పటికే వైరల్ అయింది. కానీ మంత్రి అమర్నాథ్ మాత్రం ధర్మాన అలా అనలేదని కవర్ చేస్తున్నారు. వికేంద్రీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. అమరావతి మాత్రమే రాజధాని కావాలని తెలుగుదేశం కోరుతోంది. కాబట్టి దాని కోసం వారు రాజీనామా చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ సభ్యులు రాజీనామా చేశారు. ఇక్కడ మా ఆకాంక్షకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు, మేమెందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు.
విశాఖ రాజధానికి మద్దతుగా గర్జన నిర్వహిస్తామన్న గుడివాడ అమర్నాథ్
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ పిలుపు మేరకు ఈనెల 15న భారీ ర్యాలీ నిర్వహించబోతున్నామని అమర్నాత్ తెలిపారు. ‘విశాఖ గర్జన’కు ఎక్కడికక్కడ అందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మళ్లీ మనకు గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి వదులుకోవద్దు అని ఈ ప్రాంత ప్రజలు స్పష్టం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. విశాఖలో రాజధాని వద్దు అమరావతిలోనే ఉండాలని అచ్చెన్నాయుడు కోరుకుంటున్నారని.. దీన్ని ఈ ప్రాంత ప్రజలంతా గమనించాలని అమర్నాత్ అన్నారు. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోలేదు. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలని అనుకోలేదని ఆరోపించారు. రాజధాని మీరు కోరుకోకపోతే, కనీసం నోరు మూసుకు కూర్చోండి. అంతేకానీ, చంద్రబాబునాయుడుకు బంట్రోతుల్లా తిరుగుతూ నష్టం కలిగిస్తుంటే, ఇక్కడి ప్రజలు ఊర్కే కూర్చోబోరు. అందుకే ఈ ప్రాంతానికి పాదయాత్ర పేరుతో దండయాత్రగా వస్తున్న వారి నోరు మూయించి, వారు తమ యాత్రను ఆపేసే విధంగా ఈనెల 15న ప్రదర్శన నిర్వహించబోతున్నామని అమర్నాథ్ తెలిపారు.
చంద్రబాబు కోసమే అమరావతికి పవన్ మద్దతిస్తున్నారని మంత్రి విమర్శలు
చంద్రబాబు దత్తపుత్రుడు ఇవాళ విశాఖ గర్జనపై ట్వీట్లు చేశారు. ఆయన ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు విధానాలు మాట్లాడారు. మీరు చంద్రబాబునాయుడు దత్తపుత్రుడు. అందుకే మీకు గర్జించడం తెలియదు. ఇక్కడి పరిస్థితులు మీకు తెలియదు. అయినా మీకు ఇక్కడి ఓట్లు కావాలి. అందుకే ఇక్కడ పోటీ చేశారు. కానీ ఓడిపోవడంతో కక్ష కట్టారని ఆరోపించారు. మీరు గతంలో అమరావతి గురించి ఏమన్నారో గుర్తు చేసుకొండి. ‘ఎవరి రాజధాని అమరావతి’ అన్న పుస్తకావిష్కరణలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నా మనసులో కర్నూలు రాజధాని అని ఆనాడు అన్నారు. కానీ ఇవాళ విశాఖపై కక్ష కట్టి, చంద్రబాబు విధానాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌కళ్యాణ్‌కు సినిమా జీవితాన్ని ఇచ్చింది విశాఖపట్నం. ఆయన ఇక్కడే నటనలో శిక్షణ పొందారు. చివరకు ఆయనకు పిల్లను కూడా విశాఖ ఇచ్చింది. కానీ ఆమెను వదిలేశాడు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం పవన్‌కళ్యాణ్‌దన్నారు.