Two States: జల వివాదాలకు చర్చలే పరిష్కారం - ఇద్దరు సీఎంలదీ అదే మాట - మరి చేతలు?
Water disputes: దశాబ్దాలుగా నానుతున్న జల వివాదాలపై ముఖ్యమంత్రులు పరిష్కారమే ముఖ్యమని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ముందడుగు వేస్తారా?

Telugu states water disputes: తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నానుతున్న జల వివాదాలపై ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకేసారి సయోధ్య మంత్రాన్ని పఠించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వివాదాలొద్దు.. పరిష్కారాలే ముద్దు అని ఇద్దరు నేతలు పైకి చెబుతున్నప్పటికీ, ఈ మాటలు కేవలం రాజకీయ అవసరాల కోసమేనా లేక నిజంగానే ఒక చారిత్రాత్మక ముగింపు కోసం వేసిన అడుగులా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
రాజకీయ వ్యూహం - ఉమ్మడి శత్రువు?
చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇలాంటి స్వరం వినిపించడం వెనుక బలమైన రాజకీయ కారణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్, తెలంగాణలో కేసీఆర్.. ఇద్దరూ గతంలో జల వివాదాలను ఎమోషనల్ పాయింట్స్‌గా మార్చి రాజకీయ లబ్ధి పొందారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ప్రాంతీయ సెంటిమెంట్ కంటే అభివృద్ధి ని అజెండాగా మార్చాలనుకుంటున్నారు. వివాదాలను కొనసాగించడం వల్ల ప్రాజెక్టుల వ్యయం పెరగడమే తప్ప, రైతులకు ఒరిగేది ఏమీ లేదనే వాస్తవాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని ఇద్దరూ భావిస్తున్నారని అనుకోవచ్చు.
రాయలసీమ లిఫ్ట్ గొడవ
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఓ వీరుడు బయలుదేరాడని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రాజెక్టుల నిర్మాణం కంటే విద్వేషాలు రెచ్చగొట్టడమే గత ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఆరోపించారు. అటు హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి కూడా నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధిని చూడొద్దని, పంచాయితీలు కావాలా నీళ్లు కావాలా అని అడిగితే తనకు నీళ్లే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇద్దరు నేతలు పరోక్షంగా తమ రాజకీయ ప్రత్యర్థులైన జగన్, కేసీఆర్‌లు నీటి సమస్యను కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే వాడుకున్నారని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
సమస్యల పరిష్కారానికి మార్గం ఏది?
మాటలతో సయోధ్య బాగున్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు జటిలంగా ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో బోర్డుల పరిధి, ప్రాజెక్టుల ఉమ్మడి నిర్వహణ వంటి అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. చంద్రబాబు అనుభవం, రేవంత్ రెడ్డి ఉత్సాహం కలిసి ఈ సమస్యకు ముగింపు ఇస్తాయా అన్నది చూడాలి. మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ వంటి కొత్త ప్రతిపాదనలు రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక బంధాన్ని బలపరిస్తే, ఆ నమ్మకంతోనే జల వివాదాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వీరిద్దరూ ఆశిస్తున్నారు.
చరిత్ర సృష్టిస్తారా.. కాలయాపన చేస్తారా?
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నిజంగానే విభజన సమస్యలకు ముగింపు పలికితే, వారు తెలుగు చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపినవారవుతారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే అది కేవలం ఫోటో షూట్ లకే పరిమితమైందనే విమర్శ ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒకే తరహా ఆలోచనా ధోరణి కలిగిన వారు కావడంతో, మాటలను దాటి చేతల్లోకి మారితేనే రైతులకు అసలైన న్యాయం జరుగుతుంది. లేని పక్షంలో, ఈ వివాదాలొద్దు అన్న వ్యాఖ్యలు కేవలం పండగ పూట వినిపించే ఒక మంచి నినాదంగానే మిగిలిపోతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















