ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నాయకులకు ప్రజామోదం లభిస్తుంది, వేగవంతమైన నిర్ణయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు సాధ్యమవుతాయి. అనవసర రాజకీయ ప్రభావం తగ్గి, పట్టణాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించవచ్చు.
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
AP Municipal Amendment Bill | ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంతో, ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకోవడానికి మార్గం సుగమమైంది.

- పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఈ విధానం తోడ్పడుతుంది.
AP Assembly Sessions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు 4వ సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. దీనిద్వారా రాష్ట్రంలో మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపికకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరోక్ష ఎన్నికల విధానంలో మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వం ఈ చట్ట సవరణను చేపట్టింది. ఈ బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుధవారం నాడు సభలో ప్రవేశపెట్టారు.
1986 వరకు పరోక్ష ఎన్నికలు
శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల విధానానికి సంబంధించి కొన్ని చారిత్రక అంశాలను వెల్లడించారు. 1986 వరకు పరోక్ష ఎన్నికలు జరగగా, ఆ తర్వాత 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లో ఉండేదని గుర్తుచేశారు. అయితే 2005 నుంచి పరోక్ష ఎన్నికలు సాగుతున్నాయని, ప్రస్తుత సవరణ ద్వారా మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానానికి అవకాశం వచ్చిందన్నారు. ప్రజలు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకోవడం వల్ల ఆ పదవుల్లో ఉన్నవారికి నమ్మకమైన ప్రజామోదం లభిస్తుందన్నారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవడం వల్ల మేయర్, చైర్మన్లపై వారి అనవసర ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
ఈ విధానం వల్ల వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం దక్కుతుందని, నగరాలు, పట్టణాలలో అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయవచ్చని మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి మౌలిక వసతుల కల్పనలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం సాధ్యమవుతుంది అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం సాధించి అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు.
నేరుగా ఎన్నికైతేనే ప్రయోజనం.. మంత్రి నారాయణ
నగరాలు, పట్టణాల్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పరిశ్రమలు, పర్యాటక రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యక్షంగా ఎన్నికైన మేయర్ లేదా చైర్మన్‌కు పూర్తి వెసులుబాటు ఉంటుందని మంత్రి నారాయణ వివరించారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల అనవసర రాజకీయ ప్రభావం తగ్గి, ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన నేతలు పట్టణాభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సానుకూల ప్రయోజనాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే చట్ట సవరణ తెచ్చామని వివరించడంతో, బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. దాంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల విధానంలో జరగనుంది.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Frequently Asked Questions
మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















