(Source: ECI/ABP News/ABP Majha)
Janasena What Next : ఆవిర్భావసభలో జనసేనాని పొత్తులపై క్లారిటీ ఇస్తారా ? ఊహాగానాలకు తెర దించుతారా ?
జనసేన ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇస్తారా ?క్యాడర్‌లో ఉన్న అయోమయాన్ని తొలగిస్తారా ? మచిలీపట్నంలో పవన్ ఏం చెప్పబోతున్నారు ?
Janasena What Next : జనసేన పార్టీ స్థాపించి పదేళ్లవుతున్న సందర్భంగా మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయంచారు. 14వ తేదీన సభ జరుగుతుంది. అంతకు రెండు రోజుల ముందే పవన్ కల్యాణ్ అమరావతి చేరుకుంటారు. పార్టీ నేతలతో విస్తృతంగా మంతనాలు జరుపుతారు. ఎన్నికల ఏడాదిలో నిర్వహించబోతున్న ఆవిర్భావ సభ లో ప్రకటించాల్సిన నిర్ణయాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలన్నదానిపై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నది ప్లీనరీలో ప్రకటిస్తారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.
జనసేన చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ పార్టీనేనని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. జనసేన ఆ పార్టీతో జత కడితే ఆ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికీ జనసేన పార్టీ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది. పవన్ కల్యాణ్ మాత్రమే కాదు.. బీజేపీ నేతలూ అదే చెబుతున్నారు. కొండగట్టులో ఈ విషాయన్ని పవన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ నేతలు ప్రతీ రోజూ ఈ విషయాన్ని చెబుతూంటారు. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్నారు. కానీ ఈ రెండు పార్టీలు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం లేదు. బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మద్దతు కోసం ఏ స్థాయిలోనూ జనసేనతో బీజేపీ సంప్రదింపులు జరపలేదు. దీంతో పొత్తు పై పై ప్రకటనలకే ఉందని.. వాస్తవంగా లేదన్న అంచనాలు వినపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి జనసేన దగ్గరయిందని సంకేతాలు !
గత ఆవిర్భావ సభ నుంచి పవన్ కల్యాణ్ ఓట్లు చీలనివ్వబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓట్లు చీలనివ్వబోమంటే.. చేయాల్సింది టీడీపీతో పొత్తే అని చెప్పడానికి రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అయితే ఆ విషయాన్ని పవన్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజకీయాల్లో పొత్తులు అనేది అంత తేలికగా పరిష్కారమయ్యే ప్రక్రియ కాదు. రాజకీయ పార్టీలు తామే కీలకం అనుకుంటే... తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి పూర్తి స్థాయిలో బెట్టు చేస్తాయి. ఇప్పుడు జనసేనానికి ఆ చాన్స్ వచ్చిందని జనసైనికులు నమ్ముతున్నారు. జనసేన చీఫ్ ఏమనుకుంటున్నారో మా వ్యూహం మాకుందని చెబుతున్నారు. కానీ పొత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటనలూ చేయడం లేదు.
ఒంటరిగా పోటీ చేయాలని అధికార పార్టీ సవాళ్లు !
మరో వైపు అధికార పార్టీ ... ఒంటరిగా పోటీ చేయాలని జనసేన పార్టీకి సవాళ్లు చేస్తోంది. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేరని ఎగతాళి చేస్తోంది. రాజకీయంగా ఇలా సవాళ్లు చేయడమే కాకుండా... తెర వెనుక నుంచి కూడా పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే ఈ అంశంపై పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎప్పుడూ బయటపడలేదు. ప్లీనరీలో ఈ అంశంపై క్లారిటీ ఇస్తే జనసేన క్యాడర్‌కూ ఓ స్పష్టత వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే.. ప్లీనరీలో రాజకీయ వ్యూహాలపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.