Janasena : వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
Pawan Kalyan : జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి. చేరాలనుకుంటున్న వారు కూడా ఎక్కువే. రాబోయే రోజుల్లో వైసీపీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంటుందా ?
Will Jan Sena be an alternative to YSRCP : బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరారు. నిజానికి వీరు అన్ని దశల్లో కూటమి పార్టీల నుంచి ఆమోదం లభించిన తర్వాతనే జనసేన పార్టీలో చేరారు. ఇంకా జనసేన పార్టీలో చేరేందుకు వేచి చూస్తూ చాలా మంది ఉన్నారు. పవన్ కల్యాణ్ సన్నిహితులతో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్‌సీపీ దిగ్గజ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. భవిష్యత్ రాజకీయాల కోసం కొంత మంది తమ కుటుంబసభ్యుల్ని జనసేనలోకి పంపుతున్నారు. భవిష్యత్‌లో జనసేననే ప్రత్యామ్నాయం అవుతుందని వారు అంచనా వేసుకోవడం వల్లనే ఇలా పార్టీ మారిపోతున్నారని భావిస్తున్నారు.
వైఎస్ఆర్‌సీపీకి భవిష్యత్ భయం
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోతే ప్రాంతీయ పార్టీకి పెద్దగా నష్టం ఉండదు. నాయకత్వం బలంగా ఉంటే ఎంత ఘోరంగా ఓడిపోయిన తిరిగి పుంజుకోవచ్చని టీడీపీ నిరూపిచింది. ఇప్పుడు జగన్ నాయకత్వంలోని వైసీపీ అంత కంటే ఘోరంగా ఓడిపోయింది. అయితే వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి. ఇలాంటి సమయంలో పార్టీ ఉనికి విషయంలో పార్టీ నేతలు భయపడాల్సిన పరిస్థితి ఉండకూడదు. కానీ వైసీపీలో జరుగుతోంది వేరు. పార్టీ నేతల్లో చాలా మందికి తమ పార్టీ ఉనికిపై నమ్మకం కలగడం లేదు. అందుకే వేరే దారి చూసుకుంటున్నారు.
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
కారణం మెజార్టీలే !
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు నాలుగు సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. అందులో మూడు రిజర్వుడు కేటగిరి సీట్లు. మరొకటి దర్శి. మిగతా సీట్లలో గట్టి పోటీ ఇచ్చారా అంటే.. ఎక్కడా మెజార్టీలు యాభై వేలకు తగ్గలేదు. దిగ్గజ నేతలంతా తుడిచి పెట్టుకుపోయారు. ఈ ఓటమి కారణాలేమిటో ఇప్పటి వరకూ చాలా సార్లు విశ్లేషించుకుని ఉంటారు.. ఇప్పుడా కారణాలతో పని లేదు.. కానీ మళ్లీ ఆ ఓటర్లు వైసీపీ వైపు వస్తారా లేదా అన్నదే అసలు సందేహం. మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో ఓటర్లు మళ్లీ వైసీపీ వచ్చే అవకాశం లేదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆ మెజార్టీలను తట్టుకోవాలంటే వైసీపలో ఉండి గెలవడం అసాధ్యమని అనుకుంటున్నారు. అందుకే వేరేదారి చూసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఏ ఆప్షన్ వదులుకోవడానికి సిద్దంగా లేక అత్యధిగ మంది నేతలు సైలెంట్ అయ్యారు.
పవన్ కల్యాణ్ గేట్లు తెరరవలేదు. కూటమి పార్టీల్ని ఇబ్బంది పెట్టి ఆయన నేతల్ని చేర్చుకోవాలనుకోవడం లేదు. కానీ రెండేళ్ల తర్వాత ఇదే పరిస్థితులు ఉంటాయని చెప్పలేం . అప్పుడు గేట్లు తెరవొచ్చు. వైసీపీ నేతలంతా పోలోమని జనసేన పార్టీలోకి చేరితే..వైసీపీ బలహీనమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కింది స్థాయి నేతలతో పని లేదన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. బాలినేని ఎవరు.. సీనియర్ ఎవరు అని ఆయన మీడియానే ఎదురు ప్రశ్నించారు. కానీ పైన జగన్ ఉన్నా.. కింద క్యాడర్ పూర్తి స్థాయిలో కష్టపడకపోతే.. పార్టీని నడిపించడం చాలా కష్టం. జగన్ ను చూసి ఓటు వేస్తారనుకున్నా.. ఆ ఓట్లు వేసే వారిని బూత్ వద్దకు తీసుకెళ్లగలిగే క్యాడర్ ఉండాలి కదా.
వైసీపీకి జనసేన ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పడం తొందరపాటే అవుతుంది కానీ..అవదని చెప్పడం కూడా తొందరపాటే. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.