APCID Controversy : ఏపీసీఐడీ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడానికేనా ? ఎన్ని విమర్శలొస్తున్నా ఎందుకు మారడం లేదు ?
ఏపీలో సీఐడీ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందా ? రాజకీయ కక్ష సాధింపులకు అస్త్రంగా మారిందా? తీవ్రమైన విమర్శలు ఎందుకు వస్తున్నాయి ?
APCID Controversy : వారాంతం వచ్చిందంటే ఎవరో ఒకరు టీడీపీ నేతను అరెస్ట్ చేయడానికి ఏపీసీఐడీ అధికారులు రెడీ అయిపోతారు. ఈ వారం ఎవరి వంతు? అని సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నేతలు చర్చ పెట్టుకుంటారు. ఈ నమ్మకాన్ని ఏపీసీఐడీ వమ్ము చేయలేదు. ఏ కేసు పెట్టారో తెలియదు.. ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదు.. కానీ ఎడెనిమిది మంది బృందంతో ఇంటికొచ్చేస్తారు. ఉంటే అరెస్ట్ చేస్తారు. లేకపోతే చేయాల్సినంత గందరగోళం చేస్తారు. ఆ గందరగోళం సీసీ టీవీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ సీఐడీ వెనక్కి తగ్గలేదు. తాము చేసేది చేస్తూనే ఉంది.
సోషల్ మీడియా పోస్టులపైనే ప్రధానంగా సీఐడీ కేసులు !
సీఐడీ విభాగాన్ని పోలీసు శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కారణం.. లా అండ్ ఆర్డర్ పోలీసులు చేధించలేని క్లిష్టమైన కేసుల్ని ప్రత్యేకంగా దర్యాప్తు చేసే నిపుణులైన అధికారులతో విభాగం ఉండాలని అనుకోవడం. సీఐడీ కేసు అంటే ప్రత్యేకం. కానీ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత .. పూర్తిగా సోషల్ మీడియా పోస్టులు.. రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చే్యడానికి .. అరెస్ట్ చేసిన వారిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించడానికేనన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి ఆయనపై తీవ్రంగా దాడి చేసినట్లుగా అభియోగాలు రావడం చిన్న విషయం కాదు. ఈ కేసును స్వయంగా సీఐడీ అధికారులే సుమోటోగా నమోదు చేశారు. ఇక పదుల సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారి అర్థరాత్రుళ్లు తలుపులు పగులగొట్టి మరీ అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన వారిలో అరవై ఏళ్లు పైబడిన వారూ ఉన్నారు. విశాఖలో ఓ వ్యక్తిని ఇలా అరెస్ట్ చేసిన కొన్నాళ్లకే చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీసీఐడీపై గత మూడున్నరేళ్ల కాలంలో వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులతో విమర్శలు !
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ముందుగా నోటీసులు ఇచ్చి విచారించాలి. అలా ఇవ్వకపోతే సీఐడీకి కోర్టులో ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ సీఐడీఅధికారులు ఎప్పుడూ పట్టించుకోలేదు. సీఐడీకి కోర్టుల్లో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. ఇలా నమోదు చేసిన కేసుల్లో ఒక్క దానికీ పక్కా సాక్ష్యాలు చూపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ కేసులోనూ కామన్‌గా వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం అనే ఓ కారణం చూపిస్తున్నారు. కానీ అదెలా అన్నది మాత్రం కోర్టుల్లో నిరూపించలేకపోతున్నారు. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనేది కూడా నిరూపించలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వడానికి లేదా అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు బాడీఓర్న్ కేమెరా పెట్టుకుని వెళ్తారు. కానీ ఏపీ పోలీసులు విచిత్రంగా తాము వెళ్లిన చోటు సీసీ కెమెరాలు ఉంటే వాటిలో ఫుటేజీని డిలేట్ చేయించేస్తారు. పలుమార్లు అరెస్టులపై కోర్టు సీఐడీకి హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సీఐడీ లక్ష్యం.. అరెస్ట్ చేసి కొట్టడం లేకపోతే కుటుంబసభ్యుల్ని భయపెట్టడం మాత్రమేనని అందుకే ... ఈ విషయంలో కోర్టుల్ని సైత పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. వారి తీరు చూస్తూంటే ఆ ఆరోపణలు తప్పు కాదనే అభిప్రాయం ఎక్కువ మందికి వినిపిస్తుంది.
అన్నీ కేసుల్లోనూ ఒకే రకంగా వ్యవహరంచకపోవడంతో మరిన్ని విమర్శలు !
సీఐడీ అన్ని కేసుల్నీ అలాగే చూస్తే అసలు వివాదం రాకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఫిర్యాదులపై అసలు కేసులే నమోదు చేయడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై సోషల్ మీడియాలో దారుణంగా పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేసి రెండున్నరేళ్లు దాటుతోంది..కానీ స్పందించలేదు. ఇ క మరో నేత గౌతు శిరీష కూడా ఫిర్యాదుచేశారు. ఆమె ఫిర్యాదుపై స్పందించలేదు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమెకు అర్థరాత్రి నోటీసులు ఇచ్చారు. టీడీపీ నేతల ఫిర్యాదులే కాదు.. న్యాయవ్యవస్థను కించ పరుస్తూ పెట్టిన పోస్టులపై సాక్షాత్తూ హైకోర్టు ఆదేశించినా చర్యలు తీసుకోలేదు. చివరికి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాల్సి వచ్చింది. సీఐడీ తీరు ఎంత సందేహాస్పదంగా ఉంటుందంటే.. ఇలా తాము సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్లను అరెస్ట్ చేసి తీసుకు వచ్చి.. రిమాండ్‌కు పంపాలని కోర్టును అడుగుతారు.. ఎందుకు అంటే న్యాయవ్యవస్థపై పోస్టులు పెట్టిన వారిని కూడా అలాగే పంపుతున్నారని వాదిస్తారు. సీఐడీ తెలివిగా వాదిస్తున్నామని అనుంటున్నారేమో కానీ అది వారి తీరును సూచిస్తోందని న్యాయనిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు.
ఇంత పార్టీయాలిటీ వ్యవస్థకే ప్రమాదకరం !
పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసా కల్పించాలి. నేరగాళ్లకు భయం కల్పించాలి. అది దారి తప్పిదే నష్టపోయేది ప్రజలే. పోలీసు వ్యవస్థ దారి తప్పితే... అరాచకం రాజ్యమేలుతుంది. అది రాజకీయ పార్టీలకు మేలు చేయదు.. వ్యక్తులకు మేలు చేయదు... తాత్కాలికంగా మేలు చేసినా దీర్ఘ కాలంలో చెడే చేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల వల్ల సమాజానికి.. వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుంది. అంతిమంగా ఆ అరాచకం ప్రజలపైనే పడుతుంది.