Group 1 Politics : గ్రూప్ 1 రాజకీయం సద్దుమణిగినట్లే - ఎవరికి నష్టం ? ఎవరికి లాభం?
Telangana : తెలంగాణలో ఏ అంశమైనా రాజకీయంగా హీట్ పెంచుతోంది. జీవో నెంబర్ 29 కూడా అంతే. ఆటంకాలు లేకుండా పరీక్షలసు ప్రారంభం కావడంతో .. ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో ఎవరు లబ్ది పొందారు.. ఎవరు నష్టపోయారు ?
Who benefited from Telangana Group One politics : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్స్ మెయిన్స్ పరీక్షల విషయంలో జీవో 29ను ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎగ్జామ్ తేదీ దగ్గరకు వచ్చే సరికి జీవో 29 హాట్ టాపిక్ అయిపోయింది. ఎంతగా అంటే.. ఆ జీవోపై ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి.. పరీక్షను వాయిదా వేయాలన్న డిమాండ్ తో భారీ ఉద్యమమే జరిగింది. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా పరీక్ష ఆగలేదు. మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 27 వరకూ జరుగుతాయి. అయితే ఫలితాలు మాత్రం కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయి. అందుకే ఇప్పుడు గ్రూప్ 1 రాజకీయానికి తెరపడినట్లే. మరి ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో ఎవరిది పైచేయి ?
గ్రూప్స్ పరీక్షల వాయిదా ఆందోళనలు ఎవరికి మైనస్
తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్స్ పరీక్షల కోసం ఎంతో మంది ఎదురు చూశారు. కారణం ఏదైనా బీఆర్ఎస్ మొదటి తొమ్మిదేళ్ల కాలంపో గ్రూప్స్ పరీక్షలు పెట్టలేదు. మూడో సారి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అలాంటి వాటిలో గ్రూప్ వన్ ఒకటి. కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో లీకేజీ సమస్యలు ఏర్పడి గందరగోళం అయింది. ఈ కారణంగా ఉద్యోగాల భర్తీ విషయంలో రావాల్సిన మైలేజీ బీఆర్ఎస్‌కు రాలేదు. పైగా మైనస్ అయింది. ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా యువత భావించే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ పక్రియ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైనా రద్దులు, వాయిదాలో ఇప్పటి వరకూ వచ్చింది.
బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
జీవో 29పై రాజకీయ కుట్ర జరిగిందా ?
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ వన్ ప్రక్రియను పూర్తి చేయాలని అనుకునే సమయంలో జీవో 29 వివాదం తెరపైకి వచ్చింది. తే బీఆర్ఎస్ హయాంలోనే ఒక్క జాబ్‌కి యాభై మంది రేషియోలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల్ని నిర్ణయించేలా కటాఫ్ పెట్టాలని జీవో 55 ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవో 55 విషయంలోనూ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. రిజర్వుడు పోస్టులకు 50 రేషియోలో అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. అలా తగ్గిన అభ్యర్థుల స్థానంలో మెరిట్ లిస్టు నుంచి మెయిన్స్ రాసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తెచ్చింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు 28,150 మంది అభ్యర్థులు 55 జీవో ప్రకారం మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. రిజర్వుడు, వికలాంగుల కోటాలో 1/50 నిష్పత్తి కన్న తక్కువ మంది అభ్యర్థులున్న చోట మెరిట్ జాబితా నుంచి అవకాశం కల్పించారు. దీని కోసం జీవో 29 జారీ చేశారు. ఇప్పుడు 31,382 మంది అభ్యర్థులు అయ్యారు. అదనంగా వచ్చిన 3,232 మంది అగ్రవర్ణాల వారనేది రిజర్వుడు కులాల అభ్యర్థుల వాదన. కానీ కాదని ప్రభుత్వం అంటోంది. వికలాంగులు, రిజర్వుడు కులాల ఉద్యోగాలు ఇతర కులాలకు ఇచ్చే అవకాశం ఎలా ఉంటుందన్నప్రశ్నలు వస్తున్నాయి. విషయం ఏదైనా కోర్టుకు చేరింది.
అత్యధిక మంది రేవంత్‌కే మద్దతు అంటున్న కాంగ్రెస్
చివరికి సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే నెగ్గింది. రేవంత్ రెడ్డిది మొండి పట్టుదల అని కొంత మంది విమర్శిస్తున్నారు. కానీ ఆందోళనలు చేస్తున్నారని ఇరవై వేల మంది ఆశలపై నీళ్లు చల్లడం నాయకుల లక్షణం కాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గ్రూప్ వన్ పై జరుగుతున్న ఆందోళనలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. గ్రూప్ వన్ అనేది తెలంగాణ నిరుద్యోగులు పదేళ్ల పాటు ఎదుుర చూసిన అవకాశం. మెయిన్స్ కోసం వాయిదాలు మీద వాయిదాలు కోరుకునేవారు ఎవరూ ఉండరని అంటున్నారు. అందుకే ఈ విషయంలో రేవంత్ కు యువత మద్దతు లభిస్తుందని బీఆర్ఎస్‌కే మైనస్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు.