Kavitha Comments : కారులో కాళేశ్వరం రచ్చ: కవిత కొత్త వ్యూహం- హరీశ్, సంతోషే ఎందుకు టార్గెట్ అయ్యారు?
Kavitha Comments On Harish Rao : కవిత టార్గెట్ హరీశ్ రావ, సంతోష్ రావేనా, కవిత వీరిద్దరిపై అవినీతి ఆరోపణలు చేయడానికి కారణాలేంటీ?. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహం ఉందనే తెలుస్తోంది.

Kavitha Comments On Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిపే బాధ్యతను సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ పరిణామాలు బీఆర్‌ఎస్ పార్టీలో కొత్త ప్రకంపనలకు కారణమయ్యాయి. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈసారి పెద్ద బాంబునే పేల్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు రావడానికి కారణం మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, కేసీఆర్‌కి వెన్నంటి ఉండే సంతోష్ రావులేనని ఆమె ప్రకటించారు. అయితే, వీరిద్దరిపై కవిత చేసిన ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
పార్టీలో హరీశ్ రావు, సంతోష్ రావుకు చెక్ పెట్టడం
శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిన తర్వాత కేసీఆర్ రాజకీయంగా కొంత మౌనం పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నా, బయటకు మాత్రం కేటీఆర్, హరీశ్ రావులే కనిపిస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పార్టీలో ఆమె ప్రాధాన్యం కొంత తగ్గింది. అదే సమయంలో కేసీఆర్‌కి రాసిన ఆమె లేఖ బయటపడటం, పార్టీలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత వ్యాఖ్యానించడం వంటి పరిణామాలు జరిగాయి. ఇప్పటివరకు ఎవరి పేరు బయటపెట్టకుండా, నర్మగర్భంగా పార్టీ ముఖ్యులపై విమర్శలు చేస్తున్న కవిత, ఇప్పుడు హరీశ్ రావు, సంతోష్ రావులే అవినీతికి కారణమని ప్రకటించడం విశేషం.
ఇలా వీరిద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అనేది బీఆర్‌ఎస్ పార్టీలో వారిద్దరి ప్రాభావానికి అడ్డుకట్ట వేసే వ్యూహంగా చెప్పుకోవచ్చు. తనపై లిక్కర్ కుంభకోణం ఆరోపణలను కారణంగా చూపి, ఎలా పక్కన పెట్టారో అదే రీతిలో కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు, సంతోష్‌కి పాత్ర ఉందని చెప్పడం ద్వారా పార్టీలో వారి స్థాయిని తగ్గించే వ్యూహంలో భాగంగా ఇలా మాట్లాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాళేశ్వరం ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడం
మరో కోణంలో కూడా కవిత చేసిన ఆరోపణలను చూడాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణలు మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఒకవైపు తనపై లిక్కర్ కుంభకోణం ఆరోపణలు, కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ విషయంలో ఆరోపణలు, ఇక కేసీఆర్‌పై కాళేశ్వరం విషయంలో ఆరోపణలు వస్తున్న తరుణంలో, వాటిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు కవిత హరీశ్ రావు, సంతోష్ రావుల పేర్లను బయటపెట్టి ఉండవచ్చన్న కోణంలో కూడా చూడాల్సి ఉంది. తద్వారా కేసీఆర్ పైన, తన వ్యక్తిగత కేసులపైన ప్రజల దృష్టిని మరల్చడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశ్యమనే చర్చ సాగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి కారణం హరీశ్ రావు, సంతోష్ రావులే అని చెప్పిన కవిత, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని మరో బాంబు పేల్చారు. దీన్ని ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే చేసినట్లు అర్థమవుతుంది. ఈ ఆరోపణల ద్వారా వీరిద్దరిపై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలని సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది. తను వీరిద్దరి పేర్లు ప్రకటించినా చర్య తీసుకోకపోతే, రేవంత్ రెడ్డి, హరీశ్-సంతోష్ మధ్య లోపాయికారీ సాన్నిహిత్యం ఉందని మున్ముందు ఆరోపించే అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పడం ద్వారా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనతోనే కవిత అటు హరీశ్ రావు, సంతోష్ రావుల పేర్లు చెబుతూనే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పాత్రను మీడియా సమావేశంలో చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ కుటుంబ ప్రాబల్యం తగ్గకుండా చూడటం
ఎన్నికల తర్వాత నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కొంత బలహీనపడింది. పార్టీకి కీలకమైన కేసీఆర్ కుటుంబంపై క్యాడర్‌లో నమ్మకం సడలుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫార్ములా ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ కుంభకోణం వంటివి ఇందులో ఉన్నాయి. దీంతో పార్టీ క్యాడర్‌లో, ప్రజల్లో కల్వకుంట్ల కుటుంబం ప్రతిష్ట దెబ్బతింటోంది. ఈ క్రమంలో హరీశ్ రావు, సంతోష్ రావు పేర్లు కవిత చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. పార్టీ ప్రతిష్ట దెబ్బతినడానికి, కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలకు కారణం వీరిద్దరేనని చూపించే ప్రయత్నం కవిత వ్యూహాత్మకంగా చేస్తోందనే చర్చ సాగుతోంది. వీరిద్దరూ చేసిన పనుల వల్లే కేసీఆర్‌కి చెడ్డపేరు వస్తుందనే సంకేతాలు ఈ ప్రకటన ద్వారా కవిత ఇవ్వదలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తిరిగి పార్టీలో కేసీఆర్ కుటుంబ నాయకత్వాన్ని పటిష్టం చేయడం ఇందులో భాగమని చెబుతున్నారు. భవిష్యత్తులో కవిత చేసిన ఆరోపణలు పార్టీలోనూ, తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక మార్పులకు కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.





















