Khammam Politics: ఖమ్మంలోని ఆ రెండు సీట్లపై వామపక్షాల గురి- టెన్షన్ పడుతున్న కారులో ఉన్న లీడర్లు.
రెండు సీట్లు త్యాగం చేస్తే ఉన్న నేతల పరిస్థితి ఏంటన్నది అందర్నీ తెగ టెన్షన్ పెడుతోంది. ఇంతకీ అలా జరిగితే సీనియర్ నేతలుగా ఉన్న ఆ ముగ్గురు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఖమ్మం టీఆర్‌ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కలవరం మొదలైంది. మునుగోడు ఉపఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్ పార్టీతో వామపక్షాల మద్దతు ఉంటుందని కన్ఫామ్ అయింది. సాధారణ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తు తప్పదనే భావన రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కలవరం మొదలైంది. రెండు వామపక్షల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లా వారే కావడం, జిల్లాలో కమ్యూనిస్టులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నందున పొత్తు కుదిరితే త్యాగాలు తప్పనిసరి అవుతుంది. అందుకే ఎవరి సీటు గల్లంతు అవుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
మునుగోడుతో బలంగా మారిన దోస్తీ
మునుగోడు ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించేందుకు కామ్రేడ్లతో దోస్తీ తప్పలేదు. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో ప్రతిసారీ కమ్యూనిస్టులతో పొత్తు కోసం చూసింది. మునుగోడులో విజయం కోసం సీపీఐ, సీపీఎం మద్దతు తీసుకోవడమే కాదు భవిష్యత్ ఎన్నికల్లో కూడా దోస్తీ కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది టీఆర్‌ఎస్ అధిష్ఠానం. అందుకే కమ్యూనిస్టులు ఏ సీటు అడుగుతారనే విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేత. ఆయన 2009లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేత. ఆయన ఖమ్మం ఎంపీగా పని చేశారు. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ స్థానాలపై గురి చేశారనే చర్చ సాగుతుంది.
మూడింట రెండు వారికేనా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో మూడు మాత్రమే జనరల్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. మిగిలిన వాటిలో రెండు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు కాగా ఐదు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలుగా ఉన్నాయి. వామపక్షాలకు చెందిన రాష్ట్ర కార్యదర్శులు ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, జనరల్ నియోజకవర్గాలలోనే పోటీ చేసే అవకాశం ఉండటంతో ఇప్పుడు రెండు జనరల్ స్థానాలలో త్యాగం తప్పదా..? అనేది చర్చగా మారింది. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గానికి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారథ్యం వహిస్తున్నారు. మిగిలిన కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాలను వామపక్షాలు అడిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూనంనేని సాంబశివరావు గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. అందుకే ఈ సీటు సీపీఐకి ఇస్తారనే చర్చ నడుస్తోంది. పాలేరు నియోజకవర్గం కారు పార్టీ త్యాగం చేస్తుందా..? అనేది కూడా చర్చ జరుగుతుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గానికి చెందినవారు కావడంతో ఈ స్థానం తప్పనిసరిగా ఇవ్వాలని సీపీఎం ఒత్తిడి చేసే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రస్తుతం ఈ రెండు స్థానాలకు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఈ ఇరువురు నేతలు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు.
ఇప్పుడు ఈ రెండు సీట్లు త్యాగం చేస్తే ఉన్న నేతల పరిస్థితి ఏంటన్నది అందర్నీ తెగ టెన్షన్ పెడుతోంది. ఈ రెండు సీట్లు కమ్యూనిస్టులకు త్యాగం చేస్తే మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసే వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అవుతారు. మూడు నియోజకవర్గాలకు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెంది నేతలు బరిలో ఉంటే అది కూడా ఇబ్బందిగా మారనుంది. పాలేరు నుంచి తాను ఎలాగైనా పోటీ చేస్తానని చెబుతున్న తుమ్మల నాగేశ్వరరావు పొత్తుతో రెండు సీట్లు త్యాగం చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా చర్చ జరుగుతుంది.