
28న ఢిల్లీలో ఓట్ల పంచాయితీ- పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ లోని అధికార, విపక్షాలు ఢిల్లీ వేదికగా యుద్దానికి సిద్ధమయ్యాయ్. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసేందుకు....రెడీ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, విపక్షాలు ఢిల్లీ వేదికగా యుద్దానికి సిద్ధమయ్యాయ్. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసేందుకు....ఇరు పార్టీల నేతలు రెడీ అవుతున్నారు. ఈ నెల 28న తెలుగుదేశం, వైసీపీ నేతలు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. రెండు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్ మెంట్ కోరారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకొని...వైసీపీ దొంగ ఓట్లను చేర్పించిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుకూలమైన ఓట్లను వేల సంఖ్యలో తొలగించారని...వైసీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాలో చేర్పించిందంటే విమర్శిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్ల వివరాలు సేకరించిన టీడీపీ...పక్కా ఆధారాలతో ఢిల్లీకి వెళ్తోంది.
పార్టీ అధినేత చంద్రబాబుతో కీలక నేతలు హస్తినకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారు ? టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడెక్కడ తొలగించారన్న దానిపై స్పష్టమైన ఆధారాలు సేకరించింది. దొంగ ఓట్లను జాబితాలో చేర్చడానికి సహకరించిందెవరు ? ఎవరి ప్రొద్బలంతో ఓట్లను తొలగించారు ? ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసుకున్నది ఎవరు ? ఇలా అనేక వివరాలతో ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు.
చంద్రబాబుకు పోటీగా వైసీపీ నేతలు...ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీలో 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి. 60 లక్షల ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడులో వణుకు మొదలైందని, అందుకే ఆయన హడావిడిగా ఢిల్లీ వెళ్తున్నారని ఆరోపించారు. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదని, రద్దు ప్రక్రియను మాత్రమే తప్పుబట్టిందని వివరించారు. ఇదేదో జాతీయ సమస్య అయిపోయినట్టు టీడీపీ ఎందుకంత గగ్గోలు పెడుతోందని ప్రశ్నించారు. అక్రమాలలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని.. మాయ మాటలు చెప్పడం, గోడలు దూకడం ఆయనకి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి అలవాటేనన్నారు. సేవా మిత్ర అనే యాప్ ద్వారా గతంలో చంద్రబాబు 50లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు సజ్జల.
దొంగ ఓట్ల వ్యవహారంలో అనంతపురం జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఈసీ తేల్చింది. దీంతో అతన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2021లో జడ్పీ సీఈవోగా పని చేసిన శోభా స్వరూపరాణిపై చర్యలు తీసుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
