Rahul Gandhi: లక్ష ఓట్ల చోరీ నుంచి నిబంధనల మార్పుల వరకు;ECపై రాహుల్ గాంధీ చేసిన ఐదు ప్రధాన ఆరోపణలు ఇవే!
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఈసారి సాక్ష్యాలతో వెలుగులోకి తీసుకొచ్చారు.

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం (ఆగస్టు 7, 2025) నాడు ఒక పత్రికా సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ (BJP)తో కలిసి ఎన్నికలలో మోసాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మన రాజ్యాంగ పునాది ఒక వ్యక్తి, ఒక ఓటు అనే సూత్రంపై ఆధారపడి ఉంది. కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు, సరైన వ్యక్తులు ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది? ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు చేరుస్తున్నారా? ఓటర్ల జాబితా కచ్చితమైనదా? అని అనుమానం కలుగుతోంది." అని అన్నారు.
గత కొంతకాలంగా ప్రజలలో అనుమానాలు పెరుగుతున్నాయని రాహుల్ అన్నారు. ఆయన ఐదు ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ, బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకత ఎదురుకావడం లేదని అన్నారు. బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాలు సాధిస్తోంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ పదేపదే తప్పు అని నిరూపితమవుతోంది. మీడియా ద్వారా సృష్టించిన వాతావరణం ,ఎన్నికల షెడ్యూల్‌ను అనుకూలంగా మార్చుకోవడం ఈ ఐదు అంశాల్లో భాగమే అని ఆయన అన్నారు.
ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ మంది కొత్త ఓటర్లు చేరారు
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అనుమానాల వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని తాను చూశానని అన్నారు. మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లో చేర్చిన కొత్త ఓటర్లు గత ఐదు సంవత్సరాలలో చేర్చిన వారి కంటే ఎక్కువ. చాలా ప్రాంతాల్లో చేర్చిన ఓటర్లు ఆ ప్రాంతాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది, కాని పోలింగ్ కేంద్రాల్లో క్యూలు లేవు." అని అన్నారు.
ఎన్నికల సంఘం మెషిన్ రీడబుల్ ఓటర్ల జాబితా ఇవ్వడానికి నిరాకరించింది - రాహుల్ గాంధీ
ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల సంఘం మెషిన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ఇవ్వడానికి నిరాకరించిందని ఆరోపించారు. "మాకు సాఫ్ట్ కాపీ ఉంటే, మేము మొత్తం డేటాను 30 సెకన్లలో విశ్లేషించగలిగేవాళ్ళం. కానీ మాకు కట్టలు కట్టలుగా కాగితాలు పంపించారు. వాటిని చదవడానికి, సరిపోల్చడానికి ఆరు నెలలు పట్టింది. ఒక అసెంబ్లీ స్థానానికి 30-40 మంది బృందం పగలు రాత్రి కష్టపడింది." అని ఆయన అన్నారు.
ఎవరూ విచారణ చేయకూడదని, అందుకే అన్ని నిబంధనలు మార్చారు - రాహుల్ గాంధీ
ఎన్నికల సంఘం కావాలనే స్కాన్ చేసి చదవలేని డేటాను ఇస్తోందని రాహుల్ ప్రశ్నించారు. కమిషన్ సిసిటివి ఫుటేజ్‌ను యాక్సెస్ చేయడానికి నిబంధనలను మార్చింది. దీనితోపాటు, ఎన్నికల సంఘం డిజిటల్ డేటాను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరూ విచారణ చేయకూడదనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారు అని ఆయన అన్నారు.
కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంలో 1 లక్షకు పైగా ఓట్ల అవకతవకలు - రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంలో 1,00,250 ఓట్ల అవకతవకలు జరిగాయని అన్నారు. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒక చిరునామాలో చాలా మంది ఓటర్లు, నకిలీ ఫోటోలు, ఫారం-6 దుర్వినియోగం వంటి ఐదు రకాల లోపాలను ఆయన ప్రస్తావించారు.
"ప్రజలకు పారదర్శకతపై పూర్తి హక్కు ఉంది. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను నాశనం చేయకూడదు. కాంగ్రెస్ బృందం మొత్తం వ్యవస్థను అర్థం చేసుకుంది. ప్రజల ముందు నిజం ఉంచుతుంది." అని రాహుల్ అన్నారు.





















