Supreme court On Rahul Gandhi: రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. అసలైన భారతీయులు అలా మాట్లాడరంటూ చురకలు!
Supreme Court on Rahul Gandhi | భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. మీరు నిజమైన భారతీయులైతే, ఈ మాట అనరని చెప్పింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆయన కనుక నిజమైన భారతీయుడు అయితే కనుక ఇలాంటి మాటలు మాట్లాడరు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ఖండించింది. చైనా 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుపట్టింది.
2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ సందర్భంలో భారత సైన్యం గురించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణను ముగిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలైన భారతీయులెవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ రాహుల్ గాంధీని మందలించింది. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని మీకెలా తెలిసిందని ధర్మాసంన సూటిగా ప్రశ్నించింది.
రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎజి మసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీకి ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కానీ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించారని లైవ్ లా నివేదించింది.
సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం..
రాహుల్ గాంధీ తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత సమస్యలను లేవనెత్తలేకపోతే అది మరింత దురదృష్టకర పరిస్థితి అవుతుందన్నారు. "మీడియాలో, పత్రికల్లో ప్రచురితమయ్యే విషయాలను ఆయన ప్రస్తావించకపోతే, ఆయన ప్రతిపక్ష నేత కాలేరు" అని వాదించారు. అయితే రాహుల్ గాంధీ ఆ అంశాలను పార్లమెంటులో కాకుండా సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావించారని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. ముఖ్యమైన విషయం అనుకుంటే పార్లమెంట్‌లో ప్రస్తావించాలని, సోషల్ మీడియా పోస్టులతో ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారని ధర్మాసనం మండిపడింది.
2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు మీకెలా తెలిసిందని జస్టిస్ దత్తా రాహుల్ లాయర్ సింఘ్వీని అడిగారు. మీరు ఆ ప్రాంతంలో ఉన్నారా.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమనడానికి మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన విషయం ఉందా? లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని ధర్మాసనం అడిగింది. చేస్తున్నారు. రాహుల్ గాంధీ నిజమైన భారతీయుడైతే, అలాంటి మాటలు అనరని చురకలు అంటించారు.
రాహుల్ గాంధీ పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ప్రశ్నలు అడిగినందుకు ఒకరిని ఇబ్బందిపెట్టడానికి ఇలాంటి ఫిర్యాదులు చేయడం ఒక మార్గం అని రాహుల్ గాంధీ లాయర్ సింఘ్వీ అన్నారు. BNSS లోని సెక్షన్ 223 ప్రకారం, కోర్టు క్రిమినల్ ఫిర్యాదుపై చర్యలు చేపట్టే ముందు నిందితుడిని విచారించాలని అన్నారు. ఈ కేసులో అలా జరగలేదని.. సెక్షన్ 223 గురించి ఈ వాదనను హైకోర్టులో ఇంతకుముందు లేవనెత్తలేదని జస్టిస్ దత్తా గుర్తించారు. కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నోటీసు జారీ చేసింది. పరువు నష్టం కేసులో మే 29న
అలహాబాద్ హైకోర్టు రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్నోలోని ఒక MP MLA కోర్టు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను సైతం తోసిపుచ్చింది.






















