Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
ఆచార్య జయశంకర్ స్వగ్రామంలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గద్దె దించడం ఖాయమని సవాల్ చేశారు.
" అక్కంపేట రావిచెట్టు క్రింద పోచమ్మ తల్లి సాక్షి గా చెబుతున్నా.. కేసిఆర్ చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే " తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారు. వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల కార్యక్రమం ద్వారా రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండను రేవంత్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణ కు దార్శనికత ఇచ్చిన జయశంకర్ స్వగ్రామాన్ని చూడాలని అక్కంపేట కు వచ్చానన్నారు. అక్కంపేట గ్రామం వెనుకబాటుతనానికి మచ్చుతునకలా ఉందని కేసిఆర్ కనీసం జయశంకర్ విగ్రహాన్ని కూడా పెట్టలేదన్నారు. జయశంకర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన మధుసూదనచారి ఉద్యోగం ఊడగొట్టిండని ఆరోపించారు.
జయశంకర్ పేరు ఎత్తకుండా గుర్తులేకుండా చేశారని.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ... వరంగల్ రైతు డిక్లరేషన్ ను తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. కేసిఆర్ బొందపెడుతాం, ధరణి పోర్టర్ ను గంగలో కలుపుతామని ప్రకటించారు. రావిచెట్టు క్రింద పోచమ్మ తల్లి సాక్షి గా చెబుతున్నా. కేసిఆర్ చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడేనని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే అక్కంపేటను దత్తత తీసుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ ని అక్కంపేటకు తీసుకువస్తామన్నారు. అక్కంపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రైతులే తన సైన్యమని, వారి జీవితాల్లో వెలుగులే తన గమ్యమని రేవంత్ ప్రకటించారు.
ల్యాండ్ పూలింగ్ కు భూములు పోకుండా పోరాడుదామని.. అవసరమైతే తానే రైతులతో కలిసి నేను పోరాడేందుకు వస్తానని హమీ ఇచ్చారు. దళిత ఇంటికి వెళ్ళితే కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేదలను దళితులను వేధిస్తే చెప్పుతో పొట్టుపొట్టు కొడుతామని హెచ్చరించారు. ఐదువేల జనాభా గల అక్కంపేట ను రెవెన్యూ గ్రామం గా మార్చలేదని... ఈ గ్రామం మీద ఎందుకు కేసిఆర్ కు వివక్ష, కక్ష అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామంలో రచ్చబండ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. గ్రామం మొత్తం కలియదిరిగారు.
ప్రొఫెసర్ జయశంకర్ సారు స్వగ్రామం అక్కంపేటలో నేడు రైతురచ్చబండలో పాల్గొన్నాను.
— Revanth Reddy (@revanth_anumula) May 21, 2022
స్వరాష్ట్ర కాంక్షకు ఉద్యమ ఊపిరిలూదిన ఈ గ్రామం నుండే టీఆర్ఎస్ పతనానికి రైతులతో కలిసి కదులుతున్నాను.
రైతులే నా సైన్యం. వాళ్ల జీవితాలలో వెలుగులే నా గమ్యం. pic.twitter.com/V9geT0ojVq