BRS Vs Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా సీబీఐ దర్యాప్తు - కోర్టుకెళ్లనున్న రేవంత్ ! ఫామ్‌హౌస్ కేసు మరింత లోతుకు వెళ్లనుందా?
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని..దానిపైనా సీబీఐ దర్యాప్తు చేయాలని రేవంత్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇచ్చిన ఆర్థిక,పదవుల లబ్దిపై ఆధారాలను ఇప్పటికే సేకరించుకున్నారు.
BRS Vs Congress : సీబీఐ చేతికి వెళ్లిన ఫామ్ హౌస్ కేసును సరికొత్త మలుపులు తిప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని వారిపైనా విచారణ జరిపించేలా చూడాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొదట హైకోర్టులో పిటిషన్ వేసి.. ఆ తర్వాత సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్‌లో చేరడం ద్వారా ఎమ్మెల్యేలకు ఎలాంటి లబ్ది చేకూరిందో వివరాలను సేకరించి పెట్టారు. వాటన్నింటినీ ఆధారాలుగా హైకోర్టుకు..సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నారు.
బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు !
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో కొందరికి పదవులు రాగా.. మరి కొందరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇది కూడా ప్రలోభం కిందకే వస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. పార్టీ మారినందుకు ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఏం లబ్ధి చేకూరిందన్న వివరాలనూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే ఆధారాలు కూడా సేకరించిపెట్టారు. ఇటీవల ఫామ్ హౌస్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే. ఒక్క బాలరాజు మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరు ముగ్గురికి కేసీఆర్ ఆర్తఇక ప్రయోజనాలు కల్పించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కేసీఆర్ చేసింది కూడా ఫామ్ హౌస్ కేసులో బీజేపీ చేసిన తప్పేనంటున్న రేవంత్ !
కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సబితా ఇంద్రారెడ్డి. సీఎల్పీ విలీనం అయిందని స్పీకర్ గెజిట్ జారీ చేయడంతో ఇది సాధ్యమయింది. అయితే ఇదంతా క్విడ్ ప్రో కో అని.. పార్టీ ఫిరాయింపులకు .. పదవులు ప్రలోభ పెట్టి ఇలా చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఫామ్ హౌస్ కేసు కూడా.. పూర్తిగా ఇదే కోణంలో విచారణ జరగనుంది. నలుగురు ఎమ్మెల్యేలకు పదవులు, ఆర్థిక ప్రయోజనాలు ఆశ పెట్టి.. బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారని..తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని బీఆర్ఎస్ నేతలంటున్నారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకునేందుకు కేసీఆర్ చేసింది కూడా అదే కదా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తీసుకున్నారని.. బీజేపీ అదే పని చేసిందని.. కానీ ఇప్పుడు బీజేపీ చేసింది తప్పని చెబుతున్నారు కానీ.. తాము చేసింది తప్పని అంగీకరించడం లేదన్నారు.
సీబీఐ దర్యాప్తు ను ప్లస్‌గా మార్చుకునే ప్రయత్నంలో రేవంత్ !
హైకోర్టు ఆదేశాల మేరకు.. ఫామ్ హౌస్ కేసులో విచారణ సీబీఐ చేపట్టనుంది. తనకు వంద కోట్లు ఆఫర్ చేసి.. పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారని రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే సీబీఐ దర్యాప్తు చేయనుంది. అంటే ప్రలోభాలే ఇందులో కీలకం. విచారణలో ఆల్రెడీ ప్రలోభాలకు గురైన వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు కూడా బయటకు వస్తాయి . ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి న్యాయపరంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున ఆఫర్లు ఇచ్చి బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని .. అది కూడా ఇలాంటి కేసే కాబట్టి కలిపి విచారణ చేయాలని ఆయన కోరాలని అనుకుంటున్నారు. నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేస్తే స్పందించడం కష్టం కాబట్టి.. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే సీబీఐకీ ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. హైకోర్టు విచారణ సమయంలో సీబీఐకి నోటీసులు జారీ చేస్తే.. విచారణ చేయలేమని చెప్పేందుకు అవకాశం ఉండదని అంచనా చేస్తున్నారు.
రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరడంపైనా సీబీఐ ఆరా తీస్తుంది. అదే జరిగితే.. ఈ కేసులో ఫిరాయింపుల కేసు మరింత విస్తృతం అవుతుంది. ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు.. బీఆర్ఎస్ పెద్దలకూ చిక్కులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు.