Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Janasena : పవన్ కల్యాణ్ జాతీయ స్థాయి ఫోకస్ లక్ష్యంతోనే సనాతన ధర్మ పోరాటాన్ని ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ ప్రణాళిక ప్రకారమే ఆయన ఈ ముందడుగు వేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
Pawan Kalyan : అన్ని మతాలను గౌరవిద్దాం హిందూత్వ ధర్మానికి వస్తున్న ముప్పును తరిమికొడదాం అన్న సింగిల్ పాయింట్ ఎజెండా ద్వారా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలకు తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం ఏపీకి..లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడుపైనా ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ గతంలో ఇంత తీవ్రంగా హిందూత్వ, సనాతన ధర్మంపై మాట్లాడలేద. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపించారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని అందుకే ఎక్కువ మంది నమ్ముతున్నారు.
పూర్తి స్థాయి కాషాయ వాదిగా మారిపోయిన పవన్
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం సూటిగా ఉంది. దేశంలో ఇతర మతాలకు లభిస్తున్న ప్రివిలేజెస్ హిందూత్వానికి ఉండటం లేదని పవన్ ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. హిందూత్వంపై దాడి చేసే వారికి..సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామన్న వారికీ కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయని కానీ అదే అలాంటి మాటలు ఇతర మతాలను ఉద్దేశించి అంటే.. సహించే పరిస్థితి లేదన్నారు. వారి వారి మతాల్ని వారు కాపాడుకుంటున్నారని.. హిందువులు కూడా ఆ స్ఫూర్తితో ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. తమిళనాడు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ డీఎంకే వారసుడిగా తెరపైకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం ఓ వైరస్ వంటిదని దాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు. ఇతర మతాల గురించి ఎందుకు అలా మాట్లాడరని పవన్ సూటి ప్రశ్న. దానికి సమాధానం కోసమే పోరాడాలని ఆయన చెబుతున్నారు.
ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి, అల్లా పేరు అంటే ఆగిపోతారు- తిరుపతిలో పవన్ కళ్యాణ్
దీర్ఘకాల జాతీయవ్యూహంతోనే పవన్ ప్రసంగం
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడానికి తెర వెనుక ఏం జరిగిందన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ సిద్ధాంతకర్తల ఆలోచన మేరకు వ్యవహరిస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇంత హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన .. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో తనది కమ్యూనిస్టు భావజాలమని పవన్ చెబుతూ ఉండేవారు. కమ్యూనిస్టు భావజాలానికి.. సనాతన ధర్మ రాజకీయానికి అసలు పొసగదు. మరి పవన్ అలాంటి ఎందుకు మారిపోయారంటే.. భారతీయ జనతా పార్టీ దక్షిణాది వ్యూహాన్ని పవన్ ద్వారా అమల చేస్తోందని అనుకోవచ్చు.
వాయిదా కోరిన సొలిసిటల్ జనరల్ - తిరుపతి లడ్డూ కేసు శుక్రవారానికి వాయిదా !
ముందు ముందు మరిన్ని సనాతన ధర్మ రాజకీయాలు ఖాయమే !
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే అయింది. ఇంకా పాలనపై పట్టు సాధించలేదు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన కలత చెందారని అనుకోవచ్చు. మొత్తంగా పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి హిందూత్వ నేతగా మారిపోయారని అనుకోవచ్చు. తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో.. రాహల్ గాంధీ పైనా విమర్శలు చేశారు. అంటే ఆయన బాట చాలా క్లియర్ గా ఉంది. బీజేపీతో ఆయన బంధం మరింత గట్టి పడిందని అనుకోవచ్చు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషీ కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.