Telangana phone tapping case: విచారణ కన్నా లీకులపైనే ఆందోళన- తర్వాత కేసీఆర్‌కే నోటీసులు - బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్ ?
Tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తర్వాత కేసీఆర్‌కే నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

Notices will be issued to KCR later in tapping case: తెలంగాణ రాజకీయాల్లో కుదిపేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేయడంతో, ఈ వ్యవహారం మాజీ మంత్రుల నుంచి పార్టీ అధినేత వరకు పాకే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్‌కూ నోటీసులు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు.
సీరియస్ గా సజ్జనార్ సిట్ దర్యాప్తు
ప్రారంభంలో సాధారణ పోలీసు విచారణగా మొదలైన ఈ కేసు, ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలతో సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ అయింది. సున్నితమైన కేసులను ఛేదించడంలో, క్లిష్టమైన విచారణలను జరపడంలో సజ్జనార్‌కు ఉన్న ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నత స్థాయి నాయకులను ప్రశ్నించే సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సిట్ పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది.
హరీష్, కేటీఆర్ విచారణ - తదుపరి లక్ష్యం కేసీఆర్?
ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లను సిట్ అధికారులు గంటల తరబడి ప్రశ్నించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విచారణలు కేవలం ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా నోటీసులు వెళ్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సైతం తన విచారణ అనంతరం మాట్లాడుతూ, ఈ నోటీసుల పరంపర చివరకు కేసీఆర్ వద్దకే చేరుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారనే ప్రధాన ఆరోపణను నిరూపించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది.
లీకులు , వ్యక్తిత్వ హననంపై ఆందోళన
కేసులు, విచారణల కంటే, దర్యాప్తు సంస్థల నుంచి అందుతున్న లీకుల పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ గదిలో ఏం జరుగుతుందో తెలియకముందే, కొన్ని మీడియా సంస్థల్లో తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తున్నారు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాలను లీకుల ద్వారా ప్రచారం చేయడం కేవలం తమ వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించినదేనని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అక్రమ ట్యాపింగ్‌గా చిత్రించి విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నేతల వాదన. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని ఒక పొలిటికల్ నేరేటివ్‌గా మార్చి, తమ పార్టీని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు
కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఉద్యమం
తమకు నోటీసులు ఇస్తే సహకరించాం కానీ కేసీఆర్ ను విచారణ పేరుతో వేధిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఈ అంశాన్ని పెద్ద ఇష్యూగా మార్చాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.


















