Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?
విజయవాడ ఎంపీగా పోటీ చేయడం లేదని నాగార్జున స్పష్టం చేశారు. జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారంగా తేల్చేశారు.
Nagarjuna No Politics : విజయవాడ నుంచి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరో నాగార్జున ఖండించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఏదో ఓ పార్టీ తరపున అభ్యర్థిగా తన పేరును ప్రచారంలోకి తీసుకు వస్తున్నారని కానీ తనకు ఎప్పుడూ అలాంటి ఆలోచన లేదని నాగార్డున స్పష్టం చేశారు. ఈ సారి కూడా అదే ప్రచారం చేస్తున్నారన్నారు. గత పదిహేనేళ్లుగా జరుగుతున్న ప్రచారం మళ్లీ జరుగుతోందన్నారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. దీంతో నాగార్జున ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదేనని తేలిపోయింది.
నాగార్జున వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ సారి విజయవాడ లోక్‌సభా స్థానాన్ని గెల్చుకునేందుకు బలమైన అభ్యర్థిని రంగంలోగి దించాలని అనుకుంటున్నారని .. అందుకు నాగార్జున సరైన వ్యక్తి అవుతారని భావిస్తున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కేశినేని నాని విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ వేవ్ వచ్చినప్పటికీ పార్లమెంట్ నియోజవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ మంది మెజార్టీ సాధించినప్పటికీ పార్లమెంట్ స్థానంలో మాత్రం కేశినేని నాని విజయం సాధించారు. ఈ సారి ఈ పరిస్థితి మారాలంటే బలమైన అభ్యర్థి ఉండాలని జగన్ భావిస్తున్నారు.
జగన్ తనకు ఆప్తమిత్రుడని ఇటీవల నాగార్జున ప్రకటన
సినీ గ్లామర్ కలిసి వచ్చే అభ్యర్థి అయితే బాగుంటుందని ఐ ప్యాక్ టీం కూడా సర్వేలు చేయడంతో జగన్ ..నాగార్జున అభ్యర్థిత్వాన్ని పరిశీలించినట్లుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నాగార్జున ఆత్మీయుడు. ఇటీవల తాడేపల్లిలో ప్రత్యేకంగా జగన్‌తో సమావేశం అయ్యారు. జగన్ తనకు మిత్రుడని..ఆయనను చూసి చాలా రోజులు అయిందని చూసేందుకు వచ్చానని చెప్పారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌తో నాగార్జున వ్యాపారాలు నిర్వహిస్తూంటారు. ఈ కోణంలో జగన్‌తో నాగార్జునకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని చెబుతూంటారు. వీరిద్దరి మధ్య స్నేహం బహిరంగమే. అయితే జగన్ తన మిత్రుడ్ని రాజకీయాల్లోకి ఆహ్వానించారో లేదో స్పష్టత లేదు. కానీ నాగార్జున మాత్రం లైట్ తీసుకున్నారు.
రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపని నాగార్జున
రాజకీయాల పట్ల నాగార్జున ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు. ప్రజా జీవితంలోకి రావాలని కానీ.. ఎన్నికల్లో పాల్గొనాలని కానీ ఆయన అనుకోలేదు. అయితే కారణాలేమైనప్పటికీ ఆయన రాజకీయ పార్టీల అధినేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. తర్వాత వైఎస్‌తో .. ఇప్పుడు జగన్‌తో.. అలాగే టీఆర్ఎస్ పెద్దలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ ఆయన ఈ పరిచయాల్ని రాజకీయ ఎంట్రీ కోసం ఉపయోగించుకోలేదు. నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో ఇక ఆయన విజయవాడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అనే ప్రచారం ఆగిపోయే అవకాశం ఉంది.