Telangana Latest News: తెలంగాణ మంత్రుల నోటి దురుసు: వివాదాల సుడిగుండంలో ప్రభుత్వం! సుప్రీం కోర్టు ఆగ్రహం, రాజకీయ ప్రకంపనలు!
Telangana Latest News: తెలంగాణ మంత్రుల మాటలు మంటలు రేపుతున్నాయి. పరుష పదజాలంతోనూ, అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.

Telangana Latest News: తెలంగాణ మంత్రుల మాటలు మంటలు రేపుతున్నాయి. పరుష పదజాలంతోనూ, అనాలోచితంగా చేసే వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ తరహా వ్యాఖ్యలు మంత్రుల మధ్య విబేధాలు సృష్టిస్తుంటే, ఇక ముఖ్యమంత్రి (సీఎం) చేసిన వ్యాఖ్యలను ఏకంగా సుప్రీంకోర్టే తప్పుబట్టింది. అందుకే నాలుకను 'రెండు అంచుల ఖడ్గం'గా చెబుతారు. అది పక్క పార్టీ వాళ్లనే కాదు, సొంత పార్టీ వాళ్లను కూడా ఖండించేయగల శక్తిగలది. అయితే, తెలంగాణలో ఈ మాటలు రేపుతున్న చిచ్చు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
పొన్నం వర్సెస్ అడ్లూరి
ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. అయితే, ఆ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చిన తనను పొన్నం ఒక జంతువుతో పోల్చి అమర్యాదగా మాట్లాడారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం తీరుపై మండిపడ్డారు. అయితే, తాను అడ్లూరిని ఏమీ అనలేదని, ఢిల్లీ పర్యటనకు టికెట్ బుక్ చేయని తన సిబ్బందిని ప్రస్తావిస్తూ ఆ పదం వాడానని పొన్నం వివరణ ఇచ్చారు.
అయితే, ఇది ఇంతటితో ఆగలేదు. మరో మంత్రి వివేక్ కూడా తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడడం లేదని, అందుకు కారణం తాను వచ్చిన సామాజిక వర్గమే అని అడ్లూరి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ వివాదం చివరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరకు చేరింది. ఇద్దరూ ఈ విషయాన్ని మరిచిపోయి కలిసి పని చేయాలని ఆయన చెప్పినా, ఈ విషయంలో పొన్నం తనకు క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు.
అయితే, మంత్రి అయినా, తన సిబ్బంది అయినా ఒక జంతువుతో పోల్చి తిట్టడం మాత్రం అనైతికమని పొన్నం వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తొందరపాటు వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారాయి. అయితే, దీన్ని హస్తం (కాంగ్రెస్) పెద్దలు ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి.
వేచి ఉంచినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ కోమటిరెడ్డి
నాగార్జున సాగర్ పర్యటన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మరో ఇద్దరు మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే, ఉదయం 9 గంటలకు వెళ్లాల్సింది, గంట ఆలస్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంతో ఆగ్రహించిన కోమటిరెడ్డి, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. ఇతర మంత్రులు ఫోన్ చేసినా కోమటిరెడ్డి వారి కాల్‌కు ప్రతిస్పందించలేదు. ఇది ఇద్దరి మధ్య బహిరంగ వాగ్వాదానికి దారి తీసింది.
ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, "ప్రభుత్వ వనరులను ఇష్టానుసారం వాడుకోకూడదు. కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు" అంటూ కోమటిరెడ్డిని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. దీనికి స్పందించిన కోమటిరెడ్డి, "ప్రభుత్వ వనరులను వాడుకునే హక్కు మాకు ఉంది. దీనిపై కొందరు అనవసరంగా రచ్చ చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇలా నల్గొండ జిల్లాలోనూ, క్యాబినెట్‌లోనూ ఇద్దరు సీనియర్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు ఈ ఘటన నిదర్శనమైంది.
అనుచిత వ్యాఖ్యల వివాదంలో కొండా సురేఖ
రాజకీయ విమర్శల్లో భాగంగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం లేపాయి. సినీ నటుడు నాగార్జున, నటి సమంతపై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారు తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది. సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ కూడా తీవ్ర స్థాయిలో తన ప్రతిస్పందన తెలియజేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతే కాకుండా, కేటీఆర్ దీనిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. ఈ క్రమంలో, తన వ్యాఖ్యలను కొండా సురేఖ బహిరంగంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం తొందరపాటు వ్యాఖ్యల ఫలితంగా చెప్పవచ్చు.
తొందరపాటు వ్యాఖ్యలతో సీఎంను హెచ్చరించిన సుప్రీంకోర్టు
మంత్రుల మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు ఇలా ఉంటే, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినా ఉప ఎన్నికలు వచ్చేది లేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ లో చేరిన బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ చేస్తోన్న సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (Anti-Defection Law - పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం)ను అపహాస్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికింది. సుప్రీంకోర్టు స్పందనతో సీఎం రేవంత్ రెడ్డి తిరిగి అసెంబ్లీలో తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడం జరిగింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడకూదన్న అంశం ఈ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది.
విమర్శలు, సూచనలు, అభిప్రాయాలు ఏవైనా తొందరపాటుతనంతో చేస్తే అది పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తాయనడానికిపై ఉదంతాలు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇది పాలనపైనా, పార్టీ ఎదుగుదలపైనా ప్రభావం చూపుతోంది. అంతే కాకుండా, కొందరు రాజకీయ నేతల రాజకీయ జీవితాలు సమాప్తమైన ఘటనలు సమకాలీన రాజకీయాల్లోనూ ఉన్నాయి. అందుకే, ఆచి తూచి మాట్లాడిన నేతలకే గౌరవం దక్కుతుంది.





















