Gudivada Amarnath : మద్యనిషేధం హామీ మేనిఫెస్టోలో లేదు - చేస్తామని చెప్పలేదన్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ !
మద్యనిషేధ హామీ మేనిఫెస్టోలో లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మద్యనిషేధం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అంశం రాజకీయంగా వివాదాస్పదం అవుతున్న దశలో ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పామని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు. మద్యనిషేధం చేస్తామని చెప్పలేదని.. ధరను స్టార్ హోటళ్లలో మాదిరి షాక్ కొట్టేలా పెంచుతామని మాత్రమే చెప్పామన్నారు. అలాగే చేశామని అంటున్నారు. అందుకే తాగేవాళ్లు తగ్గారు.. ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసి ఓట్లడుగుతామని జగన్ సవాల్
తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని సీఎం జగన్ అనేక సార్లు చెప్పారు. ప్రతిపక్షంలోనే ఉండగానే కాదు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. మద్యనిషేధం చేసిన తర్వాతే ఓట్లడుగుతామని కూడా పలు మార్లు సవాళ్లు చేశారు. ఏడాదికి ఇరవై శాతానికి చొప్పున తగ్గిస్తామని చెప్పి తొలి రెండేళ్లు కొంత మేర తగ్గించారు. ఎన్నికల నాటికి మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పారు. అయితే ఏపీలో ఫైవ్ స్టార్ హోటళ్లు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. వాటికే మద్యాన్ని పరిమితం చేస్తే మద్య నిషేధం దాదాపు అమలు చేసినట్లే.
ఇటీవల మద్యం దుకాణాల్ని .. బార్లను పెంచుతూ పోతున్న ఏపీ ప్రభుత్వం
అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం మద్యం దుకాణాల్ని తగ్గించకపోగా పెంచుతూ వస్తోంది. మద్యం ఆదాయాన్ని వివిధ పద్దతుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఇటీవల మద్యం బాండ్లను కూడా విక్రయించి రూ. ఎనిమిది వేల కోట్లకుపైగానే అప్పు తీసుకున్నారు. బార్ల పాలసీని కూడా ప్రభుత్వం మార్చింది. ఏకంగా మూడేళ్లకు లైసెన్సులు ఇచ్చే విధంగా ఆన్ లైన్ వేలం నిర్వహిస్తున్నారు . ఈ కారణంగా మద్యనిషేధం హామీపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా తాము మద్య నిషేధహామీని అసలు ఇవ్వలేదని చెబుతూండటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
తాము అసలు మద్య నిషేధ హామీనే ఇవ్వలేదని వాదిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్
గుడివాడ అమర్నాత్ మద్యనిషేధ హామీ తమ మేనిఫెస్టోలో పెట్టలేదని నేరుగా చెబుతున్నారు కానీ.. చాలా స్పష్టంగా ఆ అంశం మేనిఫెస్టోలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామని చెప్పారు. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఫైవ్ స్టార్ హోటళ్లలోని రేట్లకు అమ్ముతామని చెప్పినట్లుగా విశ్లేషిస్తున్నారు.
జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న టీడీపీ నేతలు
మంత్రి ప్రకటనపై టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. గతంలో సీఎం జగన్, విడదల రజనీ చేసిన వ్యాఖ్యల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
నాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవత్ గీత అన్న జగన్ రెడ్డి, ఇప్పుడు అదే మ్యానిఫెస్టోలో పెట్టిన మద్యపాన నిషేధం పై మాట తప్పి మడమ తిప్పాడు. మంత్రి ఒక అడుగు ముందుకు వేసి, అసలు మేము మద్యపాన నిషేధం హామీ ఇవ్వలేదు అన్నాడు. ఇంతకంటే మోసగాడు ఎవరైనా ఉన్నారా? మరి గతంలో మీరు చెప్పింది ఏంటి ? pic.twitter.com/2GmiG4gaDg
— Sistla Lohith (@LohithSistla) July 30, 2022