Three Capital Bill : అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు ! మంత్రి ప్రకటన సాధ్యమా ? అసాధ్యమా ?
మళ్లీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. సాధ్యమవుతుందా ? చట్ట పరంగా వెసులుబాటు ఉందా ?
Three Capital Bill : మూడు రాజధానులు. ఏ రాష్ట్రంలోనూ.. బహుశా ప్రపంచంలోనూ ఉండదని రాజకీయ పంచాయతీ ఇది. ఏపీలో ఉంది. ప్రస్తుతం అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి. కానీ స్వయంగా ప్రభుత్వమే అమరావతిని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. మూడు రాజధానులు తమ విధానం అని.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని సీఎంతో పాటు మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ గత మూడేళ్లుగా జరిగిన పరిణామాలను చూస్తే ప్రభుత్వ ప్రయత్నాలు వందశాతం విఫలమయ్యాయి. న్యాయస్థానాల్లోనూ ఊరట లభించలేదు. ఖచ్చితంగా అమరావతిని నిర్మించితీరాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసి అనుకూలంగా తీర్పు వచ్చేలా వాదనలు వినిపించుకుంటే తప్ప మూడు రాజధానుల బిల్లు మళ్లీ పెట్టడం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వం తాము మూడు రాజధానులు తెచ్చి తీరుతామంటోంది. దీంతో చాలా మందికి అది ఎలా సాధ్యమా అన్న సందేహం వస్తోంది.
రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు అసాధ్యం !
రాజధాని అమరావతిలో ఉండాల్సిందేనని విస్పష్టంగా చెప్పింది. సీఆర్‌డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టంగా చెప్పింది. ఇతర అవసరాలకు రాజధాని భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని చెప్పింది హైకోర్టు. ఏ ఒక్క కార్యాలయాన్ని కూడా అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంది.
హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతిపై బిల్లు పెట్టే అవకాశం లేదు !
అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అసాధారణంగా ఉంది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని తేల్చిచెప్పింది. ఒకసారి చట్టం చేసి అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ” రిట్ ఆఫ్ మాండమాస్ ” ఇస్తున్నామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తాము చట్ట పరంగా చేయాల్సిన తప్పనిసరి విధులను చేయకపోతే… ఆ పనులను చేసి తీరాల్సిందే అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరి ఆదేశాలను “మాండమస్”గా చెప్పుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ఉండే అత్యున్నత అధికారం ఇది. ఇలాంటి తీర్పులను కోర్టులు చాలా తక్కువ సందర్భాల్లో ఇస్తూంటాయి. ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు మాత్రమే మాండమస్ తీర్పు కోర్టులు ఇవ్వగలవు. అమరావతి విషయంలో ఇంతకు మించి రైతులకు న్యాయం చేయడానికి వేరే దారి లేదని హైకోర్టు భావించింది. ఇలాంటి తీర్పు ఇవ్వడం సరి కాదని న్యాయవ్యవస్థపై అసెంబ్లీలో జగన్ చర్చించారు కూడా !
సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేయలేదు !
తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల తీర్పుపై ఇంకా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలేదు. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కి తీసుకుంది. అసలు ఓ బిల్లు మండలిలో సెలక్ట్ కమిటీకి వెళ్తే.. దాని అలా పట్టించుకోకుండా రెండో బిల్లు పెట్టి పాస్ చేసుకున్నారు. తర్వాత ఆ బిల్లును కొట్టి వేసే పరిస్థితి ఉండటంతో వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అటు కోర్టు తీర్పును సవాల్ చేయలేదు. దీంతో ఇప్పుడు కొత్త బిల్లు పెట్టే అవకాశం లేదు. ఏ రూపంలో పెట్టినా మూడు రాజధానులకు ఎలాంటి చట్టబద్ధత వచ్చే అవకాశం లేదు.
ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకెళ్లబోతోంది !
రాజ్యాంగం ప్రకారం.. చట్టం ప్రకారం చూస్తే మూడు రాజధానుల బిల్లు పెట్టడం సాధ్యం. అయితే ప్రభుత్వం తమకు శాసన హక్కు ఉందని న్యాయవ్యవస్థ చెప్పడానికి ఎవరు అని అనుకుని బిల్లు పెట్టి పాస్ చేసుకోవచ్చు. మంత్రి అమర్నాథ్ సవాల్ చేసినట్లుగా ఈ బిల్లునుఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఏపీ అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ వైఎస్ఆర్సీపికి ఉంది. కానీ బిల్లు ఆమోదించినంత మాత్రాన చట్టం అయిపోతుందా ? రాజ్యాంగం అనుమతించవద్దా అనే ప్రశ్న వస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలి భిన్నంగా ఉంది కాబట్టి ఎమైనా చేయవచ్చన్న వాదన ఉంది. అందుకే మూడు రాజధానుల వివాదం ముందు ముందు భిన్నమైన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.