Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Andhra News: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న అంశంపై ఎవరికి వారే కామెంట్స్ చేస్తున్న వేళ జనసేన కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని ఆదేశించింది.

Janasena Reaction On Deputy CM Issue: మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ టీడీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తోన్న వేళ ఈ అంశం టీడీపీతో సహా ఇటు జనసేనలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పార్టీల నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తుండగా.. జనసేన (Janasena) పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై మంగళవారం స్పందించింది. ఇకపై ఈ అంశంపై పార్టీకి చెందిన నేతలెవరూ బహిరంగంగా స్పందించవద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఇదే అంశంపై టీడీపీ అధిష్టానం సైతం సోమవారం పార్టీ నేతలకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆ పార్టీ నేతలను ఆదేశించింది. మీడియా వద్ద కానీ, బహిరంగంగా కానీ ఈ వ్యవహారంపై స్పందించొద్దని.. ఎలాంటి ప్రకటనలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని పేర్కొంది.
ఇదీ జరిగింది
కాగా, ఇటీవల సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు (Mydukuru) పర్యటనలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి.. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని తెలిపారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. లోకేశ్ పార్టీ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారని.. యువగళం పాదయాత్రతో పోరాట పటిమను నిరూపించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో పార్టీతో సంబంధం లేకపోయినా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతూ వచ్చారు. మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇతర సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు సైతం లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని బలంగా వినిపించారు.
అటు, మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి లోకేశ్ ఫ్యూచర్ సీఎం అంటూ సీఎం చంద్రబాబు సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వారు దావోస్ పర్యటనలో ఉండగా.. సోమవారం జ్యురిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టీజీ భరత్.. లోకేశ్ సీఎం అవుతారని అన్నారు. టీడీపీలో ఫ్యూచర్ లీడర్ లోకేశ్ అని.. ఎవరికి నచ్చినా... నచ్చకపోయినా.. ఇది జరిగి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేశేనని పేర్కొన్నారు. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే తమకు ఓకే కానీ పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కాబట్టి పవన్‌ను సీఎం చేయాలంటూ ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ నిశితంగా గమనిస్తోంది. అయితే, ఇరు పార్టీల అధిష్టానాలు ఈ అంశంపై స్పందించొద్దంటూ ప్రకటనలు చేయడంతో ఇక దీనికి ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పాలి.
Also Read: AP Politics: షర్మిలకు, సీనియర్ లీడర్లకు మధ్య పొసగడం లేదా? ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

