Topudurthi VS Paritala: పాల డెయిరీ చుట్టూ రాజకీయం, తోపుదుర్తి వర్సెస్ పరిటాల
రాప్తాడులో డెయిరీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా అనుకున్నట్టుగానే పాల డెయిరీకి భూమి పూజ చేశారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. మహిళల సొమ్ము కాజేస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తోంది.
అనేక అవాంతరాల మధ్య తోపుదుర్తి మహిళా పాల డెయిరీకి భూమి పూజ చేశారు రాప్తాడు ఎంఎల్ఏ(Raptadu MLA) తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఈ డెయిరీ భూమి పూజకు ముందు అనేక వివాదాలు నడిచాయి. జిల్లాలో ములకనూరు డెయిరీ తరహాలో తోపుదుర్తి మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తుంటే పరిటాల సునీత(Paritala Sunita) రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. డెయిరీని ఏర్పాటుతో మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందని, వాటిని అడ్డుకొనేందుకు పరిటాల వర్గం కుట్రలు చేసిందని ఆరోపణలు చేశారు. మహిళా డెయిరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఆ డెయిరీకి అవసరమైన భూములు, ఆ డెయిరీ ప్రకాశ్ రెడ్డి కుటుంబం చేతుల్లో ఉండడంపైనే అభ్యంతరమంటున్నారు పరిటాల వర్గం.
భూములను సొంతంగా కొని మరో మూడు నెలల్లో డెయిరీ ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తున్నట్టు ప్రకాశ్ రెడ్డి(Topudurti Prakash Reddy) తెలపారు. ఒక్కో మహిళ వద్ద పదివేలు వసూలు చేసి దాదాపు రెండున్నరేళ్లు అయ్యిందని, వాటి లెక్క తేలాలని పరిటాల కుటుంబం డిమాండ్ చేస్తోంది. అయితే ఆ డబ్బులు దుర్వినియోగం చేయలేదని, ఆ మహిళలతోనే చెప్పించిన ప్రకాశ్ రెడ్డి వారి డబ్బులు బ్యాంకులు సేఫ్‌గా ఉన్నాయన్నారు. డెయిరీకి అవసరమైన సామగ్రి కోసం యాభై లక్షలు ఖర్చు పెట్టగా, మిగిలిన పనులు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు ప్రకాశ్ రెడ్డి. మరో మూడునెలల్లో డెయిరీ ఏర్పాటుకు సిద్దం చేస్తున్నామన్నారు. మహిళా సంఘాల సభ్యులను ములకనూరు డెయిరీకి పంపించి అవసరమైన ట్రైనింగ్ ఇప్పించినట్లు తెలిపారు ప్రకాశ్ రెడ్డి. అయితే ఈ డైరీ వెనుక తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందంటున్నారు పరిటాల వర్గీయులు.
ఇప్పటికే పది ఎకరాలు భూమిని సొంతం చేసుకోగా, మహిళా సంఘాల సభ్యులతో ఒక్కొక్కరితో పదివేలు వసూలు చేసిన వాటికి లెక్కలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు పరిటాల శ్రీరాం. జిల్లాలో ములకనూరు డెయిరీ తరహాలో డెయిరీ ఏర్పాటు చేస్తే పరిటాల కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అడ్డుకొనేందుకు కట్ర జరుగుతోందన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.
అవాంతరాలు దాటుకొని తోపుదుర్తి మహిళా పాల డెయిరీకి భూమి పూజ చేశామన్నారు తోపుదుర్తి. త్వరలోనే రోజుకు పదివేల లీటర్ల సామర్థ్యంతో డెయిరీని ప్రారంభిస్తామన్నారు. ఈ డెయిరీ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తారని, ఇదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కాకనే పరిటాల కుటుంబం ఆరోపణలు చేస్తుందంటున్నారు తోపుదుర్తి వర్గీయులు. రానున్న రోజుల్లో ఈ డెయిరీ వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.